రైతులను మోసం చేస్తున్నారు

New Agricultural Reforms Have Given Farmers Says Pm Narendra Modi - Sakshi

విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం

సాగు చట్టాలతో రైతులకు లాభమేనని పునరుద్ఘాటన

వారణాసి/న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా వారిని మోసం చేసిన వారే ఇప్పుడు ఈ చరిత్రాత్మక చట్టాలపై దుష్ప్రచారం చేస్తూ మళ్లీ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాది రైతులు దేశ రాజధానిని దిగ్బంధించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో సోమవారం జరిగిన ఒక బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రూ. 2,447 కోట్లతో వారణాసి నుంచి అలహాబాద్‌ వరకు 73 కి.మీ.ల మేర అభివృద్ధి చేసిన ఆరు మార్గాల రహదారిని మోదీ జాతికి అంకితం చేశారు. వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. టెంపుల్‌ కారిడార్‌ పనులను సమీక్షించారు. బోట్‌లో అక్కడి ఘాట్‌లను సందర్శించారు. సాయంత్రం నదీతీరంలో దీపాలు వెలిగించే ప్రఖ్యాత ‘దేవ్‌ దీపావళి’ కార్యక్రమాన్ని వీక్షించారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ వ్యవసాయ చట్టాలను గట్టిగా సమర్థ్ధించారు. రైతులు ఇప్పుడు కూడా గతంలోలా వ్యవసాయ మార్కెట్లలో కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలుందని గుర్తు చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలతో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు మరికొన్ని మార్గాలు లభించాయని వివరించారు. కొత్తగా చట్టాలు వచ్చినప్పుడు అనుమానాలు రావడం సహజమేనని, కానీ ఇప్పుడు  తప్పుడు ప్రచారంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, యూరియాపై ఇన్నాళ్లు రైతులను మోసం చేశారని విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతంలో మోసపోయిన చరిత్రను దృష్టిలో పెట్టుకున్న రైతులు.. ఇప్పుడు తమ చట్టాలను కూడా అనుమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  గంగానదీ తీరంలో జరిగిన దేవ్‌ దీపావళి ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా ‘ఈ రోజు కాశీకి ప్రత్యేకమైన రోజు’ అని వ్యాఖ్యానించారు.
 
టీకా పురోగతిపై ప్రధాని సమీక్ష
కరోనా వైరస్‌ టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. టీకా సామర్థ్యం సహా అన్ని అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని వారిని కోరారు. టీకా నియంత్రణ విధానాలపై సూచనలివ్వాలని కూడా వారిని కోరారు. పుణెలోని జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఈ లిమిటెడ్, హైదరాబాద్‌ లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు. టీకా ప్రయోగ ఫలితాలు ప్రజలందరికీ ఉపయోగపడేలా టీకా ఉత్పత్తిదారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా అన్ని సంబంధిత విభాగాలకు ప్రధాని సూచించారు.

టీకా ప్రయోగ పురోగతి, టీకా ప్యాకేజ్, రవాణా, నిల్వ, కోల్డ్‌ స్టోరేజ్‌లు సహా మౌలిక వసతుల ఏర్పాట్లు, మానవ వనరుల అవసరం, వినియోగంపై జాగ్రత్తలు.. తదితర అంశాలపై ప్రధాని మోదీ వారితో చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ టీకాల రూపకల్పన వివిధ దశల్లో ఉందని, వాటి ప్రయోగాల పూర్తి సమాచారం, ఫలితాలు వచ్చే సంవత్సరం మొదట్లో వెల్లడయ్యే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అమెరికాలోని హెచ్‌డీటీ బయోటెక్‌ కార్పొరేషన్‌తో జెనోవా బయోఫార్మాçస్యూటికల్స్, అమెరికాకే చెందిన డైనావాక్స్‌ టెక్నాలజీస్, బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో బయోలాజికల్‌ ఈ లిమిటెడ్, రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌స్టిట్యూట్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ కరోనా టీకా రూపకల్పన, ఉత్పత్తి అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

2020 మనకు ఆవిష్కరణల సంవత్సరం
 కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 సంవత్సరాన్ని మిగతా ప్రపంచం అంతా బాహ్య అంతరాయాల మయంగా భావిస్తోందని, ఇండియాకు మాత్రం అంతర్గత ఆవిష్కరణల సంవత్సరం అని  ప్రధాని మోదీ అభివర్ణించారు.  మనోరమ ఇయర్‌బుక్‌–2021లో ‘అత్మనిర్భర్‌ భారత్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ శీర్షికతో ప్రధాని ప్రత్యేక వ్యాసం రాశారు. కరోనా విపత్కర సమయంలో దేశ ప్రజలంతా ప్రదర్శించిన నిబ్బరం, తెగువ, క్రమశిక్షణ, బాధ్యత, సహనాన్ని చూసి ప్రపంచం ఎంతో అబ్బురపడిందన్నారు. టీకా అభివృద్ధి కోసం భారత్‌ కంపెనీలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ఔషధ కర్మాగారంగా అవతరించిందని పేర్కొన్నారు.

4న అఖిలపక్ష భేటీ
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితి, టీకా పురోగతి.. తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 4వ తేదీన అఖిలపక్ష భేటీని నిర్వహిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లోని పార్టీల ముఖ్య ప్రతినిధులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ భేటీని ఏర్పాటు చేస్తోందని, ఇప్పటికే ఆహ్వానం పంపించిందని వెల్లడించాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన లోక్‌సభ, రాజ్యసభల అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ భేటీలో పాల్గొంటారని తెలిపాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top