నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిరసనలు.. రెడా-పోలీసుల పరస్పర ఆరోపణలు

NEET PG Counselling Protest FAIMA Call For Withdrawal Health Care Services  - Sakshi

NEET PG Counselling Delay: నీట్‌ పీజీ అడ్మినిషన్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం అవుతుండడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్‌ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సోమవారం పోలీసులు రెసిడెంట్‌డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పలువురు రెడాలు గాయపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయం నుంచీ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

నీట్‌ విషయమై వాదనలు వింటున్న సుప్రీం కోర్టుకు రెడాలు ఎయిమ్స్‌ పక్కనే ఉన్న సఫ్‌దార్‌జంగ్‌ ఆస్పత్రి ప్రాంగణం నుంచి మార్చ్‌ నిర్వహించబోతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు మూసేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రెడాలపై పోలీసుల తీరును ఖండిస్తూ.. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోషియేషన్‌(FAIMA) డిసెంబర్‌ 29, ఉదయం 8గం. నుంచి దేశవ్యాప్తంగా అన్నీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  

వాస్తవానికి డిసెంబర్‌ 2020లో నీట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడుతూ వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నడుమే ఈ సెప్టెంబర్‌లో నీట్‌ పరీక్షను నిర్వహించింది ప్రభుత్వం. అయితే అడ్మిషన్‌ ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ తరుణంలోనే రెసిడెంట్‌ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెడాలపై లాఠీఛార్జ్‌, అసభ్య పదజాల ప్రయోగం ఆరోపణలను పోలీసులు ఖండించారు. పైగా రెడాలే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో 12 మందిని అరెస్ట్‌ చేసి.. ఆపై రిలీజ్‌ చేసినట్లు ప్రకటించారు. సఫ్‌దార్‌జంగ్‌ ఆస్పత్రి నుంచి మార్చ్‌ నిర్వహించకుండా మాత్రమే అడ్డుకున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచే అత్యవసర సేవల్ని మినహాయించి.. అన్ని విభాగాలను రెసిడెంట్‌ డాక్టర్లు బహిష్కరించారు. కరోనా, ఒమిక్రాన్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు సైతం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top