రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు

Naxals Free CRPF Jawan Rakeshwar Singh Abducted After Bijapur Encounter - Sakshi

తెల్లవారుజామున విలేకరులకు మావోయిస్టుల ఫోన్‌ 

ఉదయం 4 గంటలకు బయల్దేరిన మధ్యవర్తులు, జర్నలిస్టులు 

100 కి.మీ పైగా బైకులపై ప్రయాణం 

మావోల వద్దకు వెళ్లిన విలేకరులతో ఫోన్లో మాట్లాడిన ‘సాక్షి’ 

సాక్షి, హైదరాబాద్‌/భద్రాద్రి–కొత్తగూడెం: మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాను రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు. అతన్ని విడిపించేందుకు మధ్యవర్తులు, విలేకరులు దండకారణ్యంలోకి 100 కిలోమీటర్లకుపైగా బైకుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ప్రత్యేక చర్చల ప్రక్రియ ఎట్టకేలకు సఫలం కావడంతో ఆరురోజుల తర్వాత రాకేశ్వర్‌ సింగ్‌ చెరవీడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోలకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మంగళవారం నాటికే సానుకూల సంకేతాలు పంపింది. కానీ అదే సమయంలో రాకేశ్వర్‌ క్షేమంపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే కేంద్రం హామీలపై సంతృప్తి చెందిన నేపథ్యంలోనే మావోలు బుధవారం రాకేశ్వర్‌ సింగ్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సందేశం మావోయిస్టులకు తెలియజేయడానికి నమ్మకస్తులు, తటస్థులైన ధర్మపాల్‌ షైనీ, తెల్లం బోరయ్యలను ఎంపిక చేసుకున్నాయి.  

జర్నలిస్టులకు ముందే సమాచారం: జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు బుధవారమే మధ్యవర్తులతో పాటు ఏడుగురు విలేకరులకు అర్ధరాత్రి దాటాక ఫోన్‌ చేస్తామని చెప్పి ఉంచారు. అదే ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇద్దరు మధ్యవర్తులను తీసుకుని బీజాపూర్‌ నుంచి బైకులపై బయ ల్దేరాలని జర్నలిస్టులకు సూచించారు. దీంతో మొత్తం 9 మంది అటవీమార్గాన దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్‌కౌంటర్‌ జరిగిన జొన్నగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ.. వారి వెంట ఎవరూ ఫాలో కాలేదని మావోలు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి లోపలికి మరో 15 కిలోమీటర్లు ఫోన్లో సూచనలు ఇస్తూ పిలిపించుకున్నారు. మొత్తానికి ఉదయం 9.30 గంటలకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రాకేశ్వర్‌ను బంధించిన చోటుకు వీరంతా చేరుకున్నారు. అక్కడ వారికి కోడి, టమాట కూరలు, చపాతీలతో భోజనం పెట్టారు. మధ్యవర్తులతో మావోయిస్టులు ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. 

జొన్నగూడకు 40 మంది మావోయిస్టులు  
మధ్యాహ్నం 12 దాటగానే మధ్యవర్తులు, జర్నలిస్టులు జొన్నగూడ వైపు బయల్దేరారు. రాకేశ్వర్‌ సింగ్‌తో పాటు 40 మంది మావోయిస్టులు వారిని అనుసరిస్తూ వచ్చారు. తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొన్నగూలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో అందరిముందు రాకేశ్వర్‌ తాళ్లు విప్పి బంధ విముక్తుణ్ణి చేసిన మావోయిస్టులు అతన్ని మధ్యవర్తులకు అప్పగించారు. మావోయిస్టులు తమను బాగా చూసుకున్నారని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం కానీ, దురుసుగా ప్రవర్తించటం కానీ చేయలేదని చర్చల్లో పాల్గొన్న ముఖేశ్‌ చంద్రాకర్‌ ‘సాక్షి’కి వివరించారు.    

చదవండి: (రాకేశ్వర్‌సింగ్‌ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?)  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top