
వీడియోకాల్‌లో డాక్టర్ సూచనలతో సురక్షితంగా డెలివరీ
ముంబై: ఆ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమాలో అత్యవసర సమయంలో ఓ డాక్టర్ వీడియోకాల్‌లో సూచనలు ఇస్తుండగా ఓ మహిళకు హీరో పురుడు పోసే సన్నివేశం ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజజీవితంలో ముంబైలో జరిగింది. గత మంగళవారం రాత్రి ముంబై లోకల్ రైళ్లో వికాస్ బిద్రే అనే వీడియో కెమెరామెన్ ప్రయాణిస్తుండగా అదే రైళ్లో 24 ఏళ్ల అంబికా ఝా పురుటి నొప్పులతో బాధపడటం గమనించాడు.
చుట్టూ మరికొందరు ఉన్నా వికాస్ మెరుపులా స్పందించి అత్యవసర స్విచ్ నొక్కి రైలును రామ్‌మందిర్ స్టేషన్‌లో ఆపేశాడు. అప్పటికే అంబికాకు ప్రసవం కావటం ప్రారంభమైంది. శిశువు సగంవరకు బయటకు వచి్చంది. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న దుకాణాల వద్దకు పరుగెత్తి పరుపుల్లాంటివి పట్టుకొచ్చి ఆమెను పడుకోబెట్టారు. వికాస్ వెంటనే తన స్నేహితురాలైన దేవిక అనే డాక్టర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ఆమె వీడియోకాల్ చేసి సూచనలు ఇస్తుండగా అంబికకు వికాస్ డెలివరీ చేశాడు. అంతకుముందు ప్లాట్‌ఫాం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రతను గుర్తించి డెలివరీ చేసేందుకు వారు ముందుకు రాలేదు.
దీంతో ఆమె బంధువులు మళ్లీ ప్లాట్‌ఫాం వద్దకు తీసుకురావటంతో వికాస్ ధైర్యం చేసి తన స్నేహితురాలి సహకారంతో పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డను ప్రైవేటు అంబులెన్స్‌లో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంజీత్ థిల్లాన్ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయటంతో వికాస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కజ్రత్ జమ్‌ఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వికాస్ చేసిన పని మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. దేవిక సూచనలతోనే తాను పురుడు పోయగలిగానని వికాస్ తెలిపాడు.