లోకల్‌లో అందరికీ అనుమతివ్వండి 

Mumbai Local News: Restore Local Trains In Mumbai For Common People - Sakshi

లేదంటే సామాన్యుల ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం

పరిణామాలకు ప్రభుత్వం, రైల్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది

ఆయా విభాగాలకు రైల్వే ప్రయాణì కుల సంఘటన హెచ్చరిక

ఇప్పటికే ప్రైవేట్, ఇతర వాహనాల్లో రద్దీ పెరిగిపోయిందని వెల్లడి

సాక్షి, ముంబై: సామాన్యులను కూడా లోకల్‌ రైళ్లలో అనుమతివ్వాలని, లేదంటే ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదముందని రైల్వే ప్రయాణికుల సంఘటన ప్రభుత్వాన్ని, రైల్వే అధికారులను హెచ్చరించింది. ఆ తరువాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, కూలీలు, కార్మికులు, చిరు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే కష్టజీవులు విధులకు హాజరయ్యేందుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్‌ రైళ్లలో సామాన్యులకు అనుమతి లేకపోవడం వల్ల ప్రజా రవాణ వ్యవస్థపై లేదా సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.

విజ్ఞప్తులపై దాటవేత.. 
ప్రజా రవాణ వ్యవస్థను ఆశ్రయిస్తున్న చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులకు ప్రతీరోజు రూ.100–150 చార్జీలు చెల్లించి విధులకు రావడం వీలుపడటం లేదు. అదేవిధంగా ఇందనం ధరలు పెరగడంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సామాన్య ఉద్యోగులు కూడా సొంత వాహనాల్లో రాకపోకలు సాగించడం ఆర్థిక పరంగా గిట్టుబాటు కావడం లేదు. దీంతో లోకల్‌ రైళ్లలో సామాన్యులందరికి అనుమతివ్వాలని ఇటు ప్రభుత్వానికి అటు రైల్వే పరిపాలనా విభాగానికి ప్రయాణికుల సంఘటన వినతి పత్రాలు అందజేసింది.

అయినప్పటికీ ఇరు సంస్థల నుంచి స్పందన రాలేదు. దీంతో సామాన్య రైల్వే ప్రయాణికులు వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని పిలుపునిస్తూ సంఘటన ద్వారా సోషల్‌ మీడియాలో సందేశాలు వైరల్‌ అయ్యాయి. అయినప్పటికీ స్పందన రాలేదు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని సంఘటన విజ్ఙప్తి చేసింది.

అయినప్పటికీ ఇరు సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. లోకల్‌ రైళ్లలో అనుమతించకపోవడం వల్ల చిరు ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు, కూలీలు, ఇతర రంగాల్లో చేనిచేస్తూ పొట్ట నింపుకునే పేదలు తమ కుటుంబాన్ని పస్తులుంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

అయినప్పటికీ అనుమతించడానికి ప్రభుత్వం, రైల్వే ముందుకు రావడం లేదు. గణేశోత్సవాల తరువాతే సామాన్యులకు అనుమతించే విషయంపై ఆలోచిస్తామని ఇటీవల ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో ప్రయాణికులు సంఘటన ఆగ్రహం వ్యక్తంచేసింది.

దీంతో చిరు ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులు ఇటు లోకల్‌ రైళ్లలో అనుమతి లేక అటు ప్రజా రవాణ వ్యవస్థ ద్వారా, సొంత వాహనాల్లో కార్యాలయాలకు, వ్యాపార సంస్ధలకు, షాపులకు చేరుకోలేక గత సంవత్సరన్నర నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అతి తక్కువ చార్జీలు, వేగంగా రాకపోకలు సాగించాలంటే ముంబైకర్లకు లోకల్‌ రైళ్లు ఒక్కటే ప్రధాన రవాణ సాధనాలుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 75–80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారంటే దీన్ని బట్టి లోకల్‌ రైళ్లకు ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో ఇట్టే అర్థమవుతోంది.

ఇతర వాహనాల్లో విపరీతమైన రద్దీ.. 
లోకల్‌ రైళ్లలో సామాన్యులందరికి అనుమతినిస్తే రద్దీ పెరుగుతుంది. ఫలితంగా తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్‌ మళ్లీ పడగవిప్పే ప్రమాదముందని ప్రభుత్వం అంటుంది. ఒక్క పొంచి ఉన్న కరోనా మూడో వేవ్‌ ప్రమాదం, మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్, డేల్టా వేరియంట్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే సామాన్యులందరికి లోకల్‌ రైళ్లలో అనుమతివ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ, ప్రైవేట్‌ వాహనాలు, ప్రజా రవాణ బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది.

వీటివల్ల కరోనా, బ్లాక్‌ ఫంగస్, డేల్టా వేరియంట్‌ కేసులు పెరగవా..? కేవలం లోకల్‌ రైళ్లలో రద్దీ వల్ల కేసులు పెరుగుతాయా..? అంటూ ప్రయాణికుల సంఘటన నిలదీసింది. ఇప్పటికే సామాన్య ప్రజలు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో గణేశోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

వీటన్నింటిని పరిగణంలోకి తీసుకుని దశల వారిగా అందరికి అనుమతివ్వాలని ప్రయాణికుల సంఘటన విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని, ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం, రైల్వే పరిపాలన విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top