గిఫ్ట్‌గా హనీమూన్‌ ట్రిప్‌; ఎడారి దేశంలో జైలుపాలు

Mumbai Couple Gifted Honeymoon Trip Faces Charges Qatar Jail - Sakshi

ముంబై: పెళ్లై సంతోషంగా గడుపుతున్న జంటకు హనీమూన్‌ ట్రిప్‌ పేరిట ఎర వేసిందో సమీప బంధువు. తన సొంతలాభం కోసం, వారి ప్రయాణ ఖర్చులు భరించి, జైలుపాలు చేసింది. దీంతో ఏడాదికి పైగా ఎడారి దేశంలోని జైళ్లలో మగ్గుతున్న ఆ జంటను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు వారికి బాసటగా నిలిచారు. అక్రమ కేసు నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు.. ముంబైకి చెందిన ఒనిబా, షరీఖ్‌లు దంపతులు. సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితాల్లోకి సమీప బంధువైన తబుస్సుమ్‌ రియాజ్‌ ఖురేషీ అనే మహిళ ప్రవేశించింది. పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్లలేదు గనుక ఖతార్‌ ట్రిప్‌ను బహుమతిగా ఇస్తానని, అక్కడికి వెళ్లి సంతోషంగా గడపాలంటూ చెప్పింది. దీంతో తొలుత ఈ గిఫ్ట్‌ను నిరాకరించిన సదరు దంపతులు, ఆ మహిళ ఒత్తిడి పెంచడంతో సరేనన్నారు. బ్యాగులు ప్యాక్‌చేసుకుని ఖతార్‌కు పయనమయ్యారు. అయితే, దురుద్దేశంతోనే ఒనిబా, షరీఖ్‌లకు ఈ బహుమతి ఇచ్చిన తబస్సుమ్‌, వారికి తెలియకుండా, లగేజీలో 4 కిలోల హషిష్‌(డ్రగ్స్‌) ప్యాకెట్‌ను పెట్టింది. దోహాలో ఉన్న తమ స్నేహితుల కోసం ఈ ప్యాక్‌ పంపిస్తున్నానని నమ్మబలికింది. తెలిసిన వ్యక్తే గనుక వారు కూడా ఆమెను నమ్మి ప్యాకెట్‌ తెరచిచూడలేదు. (చదవండి: పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆపై)

ఈ క్రమంలో జూలై 6, 2019న హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే, ఖతార్‌ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ఈ జంటకు 10 ఏళ్ల శిక్ష విధించడంతో పాటు, కోటి రూపాయల జరిమానా విధించింది. దీంతో ఈ ఏడాది కాలంగా ఒనిబా, షరీఖ్‌లు అక్కడి జైళ్లో జీవితం గడుపుతున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన ఎన్‌సీబీ, ఈ డ్రగ్స్‌ కేసుతో ఒనిబా దంపతులకు సంబంధం లేదనే నిర్ధారణకు వచ్చింది. చండీగఢ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన, తబస్సుమ్‌ అనుచరుడు నిజాం కరాను అక్టోబరు 14న అరెస్టు చేసిన ఎన్‌సీబీ, విచారణలో భాగంగా ఒనిబా, షరీఖ్‌ల  కేసును ఛేదించింది. (ఆన్‌లైన్‌ క్లాసులు: కూతురిని పెన్సిల్‌తో పొడిచి)

పథకం ప్రకారమే తబస్సుమ్‌ వారిద్దరిని ఖతార్‌ ట్రిప్పునకు పంపిందన్న నిజాం వాంగ్మూలంతో ఆమెపై కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తబస్సుమ్‌ ప్రస్తుతం పరారీలో ఉంది. ఇదిలా ఉండగా.. ఒనిబా తండ్రి షకీల్‌ అహ్మద్‌ గతేడాది సెప్టెంబరులో ఎన్‌సీబీకి లేఖ రాశారు. తన కూతురు, అల్లుడిని విడిపించాల్సిందిగా కోరారు. ఇక ప్రస్తుతం ఈ కేసులో నిజానిజాలు బయటపడినందున వారి అభ్యర్థనను మన్నించిన ఎన్‌సీబీ, ఖతార్‌ అధికారులను సంప్రదించి ఈ కేసు విషయమై చర్చించి, ఒనిబా దంపతులను విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా ఖతార్‌లో అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చిన ఒనిబా, ఈ ఏడాది మార్చిలో జైళ్లోనే బిడ్డకు జన్మనిచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top