కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలి

MP Vijaya Sai Reddy Demand 8 Lakh Vacant Central govt Posts Be Filled - Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ ఖాళీలను త్వరితగతిన భర్తీచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఉద్యో గ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తద్వారా నియామక ప్రక్రియ పూర్తికావడం బాగా ఆలస్యం అవుతోందని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్‌మెంట్‌ పరీక్షల కో  సం ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడే యవతీ యువకులను ఈ పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని చెప్పారు. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయడంలో కేంద్రం ఉదాసీన వైఖరి వల్ల లక్షలమంది యువతీయువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ఖాళీల భర్తీకి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులోను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీచేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

స్విమ్స్‌కు రూ.58.31 కోట్లు విడుదల
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌)కు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) తొలిదశలో వైద్య పరికరాల సేకరణకు కేంద్ర వాటాగా రూ.58.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరో గ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్‌  వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాల, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలల ఆధునికీకరణకు రూ.150 కోట్లు (కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లు) వేర్వేరుగా పీఎంఎస్‌ఎస్‌వై–2లో అనుమతించినట్లు తెలిపారు. 

ఆశా వర్కర్లకు రూ.10వేల ప్రోత్సాహకం
కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకంతో కలిపి ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్‌ తెలిపారు. 

ఎల్‌ఐసీ మూలధన పెంపునకు అనుమతి
చెల్లింపుల మూలధనాన్ని పెంచుకోవడానికి ఎల్‌ఐసీకి అనుమతించామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌ తెలిపారు. గతనెల 31 నాటికి ఎల్‌ఐసీ చెల్లింపు మూలధనం రూ.6,324.99 కోట్లు అని వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు రూ.36.1 కోట్లు విడుదల
సాగరమాల పథకంలోని కోస్టల్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ పిల్లర్స్‌లో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు రూ.72 కో ట్లు మంజూరు చేశామని, దీన్లో రూ.36.1 కోట్లు విడుదల చేశామని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మో పిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top