త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరమా?
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆగ్రహం
తాము ‘ఇండియా’కూటమికి వ్యతిరేకం కాదని వెల్లడి
నాగపూర్: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనధికారిక అత్యవసర పరిస్థితిని అమలు చేస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఆయన బుధవారం నాగపూర్లో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం ఎలా అవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజంగా ఎమర్జెన్సీ విధించాలనుకుంటే.. అధికారికంగానే విధించాలని అన్నారు. కానీ, పిరికిపందలా వ్యవహరిస్తూ అనధికారికంగా ఎమర్జెన్సీని అమలు చేయడం సరైంది కాదని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ప్రదర్శించినందుకు ఐదు రోజుల పాటు నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామిక చర్య అని దుయ్యబట్టారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఇలాంటివి జరగలేదని పేర్కొన్నారు. ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం కూడా అత్యంత ఘోరమైన నేరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దడానికి నరేంద్ర మోదీ లేదా మరెవరైనా ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీజేపీ అనేది స్వతంత్రంగా పనిచేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఒక సమూహమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని దీప్కే వివరించారు. తాము విపక్ష ‘ఇండియా’కూటమికి వ్యతిరేకం కాదన్నారు.


