నేడు ఈడీ ముందుకు కవిత

MLC Kavitha will attend the hearing in the ED office - Sakshi

ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ 

సౌత్‌గ్రూపు లావాదేవీలు, ఆరోపణలపై ప్రశ్నించే అవకాశం 

న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన కవిత  

వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానన్న అరుణ్‌ పిళ్లై 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. సౌత్‌ గ్రూపు లావాదేవీలు, ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు, కిక్‌ బ్యాక్‌లు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై విచారించే అవకాశం ఉందని తెలిసింది. హైదరాబాద్‌ నివాసంలో, ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగినట్టుగా చెబుతున్న సమావేశాలపై కూడా ప్రశ్నించవచ్చని సమాచారం.

ఇండో స్పిరిట్స్‌ ఎల్‌1 దరఖాస్తుపై సమస్యలు వస్తే అరుణ్‌ పిళ్లై ద్వారా తనకు తెలియజేస్తే, తన స్థాయిలో పరిష్కరిస్తానని సమీర్‌ మహేంద్రుకు ఎమ్మెల్సీ కవిత తెలిపారని ఈడీ చార్జిషీట్‌లో ఆరోపించిన నేపథ్యంలో దీనిపైనా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలావుండగా జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష అనంతరం బసకు చేరుకున్న కవిత న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు.  

ప్రత్యేక కోర్టులో పిళ్లై పిటిషన్‌ 
లిక్కర్‌ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని.. కవిత బినామీ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ పిళ్లై విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ఈడీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరుణ్‌ పిళ్లైను ఈడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో.. పిళ్లై వేసిన పిటిషన్‌ చర్చనీయాంశమయ్యింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top