సంచలన వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ

Mehbooba Mufti First Message Cannot Forget the Insult of August 5 - Sakshi

కశ్మీర్‌: గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మాలో ఎవరూ మర్చిపోలేము అన్నారు జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. 14 నెలల నిర్బంధం తర్వాత మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేశారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ ప్రజలను ఉద్దేశిస్తూ ముఫ్తీ.. ‘ఢిల్లీ దర్బారు ఆర్టికల్‌ 370 ని చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్దతిలో రద్దు చేసింది. దాన్ని తిరిగి సాధిస్తాం. ఇదే మాత్రమే కాదు కశ్మీర్‌ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీని కోసం అనేక మంది కశ్మీరీలు తమ ప్రాణాలు వదులుకున్నారు. ఇందుకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మార్గం సులభం కాదని మాకు తెలుసు.

కానీ మా పొరాటాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు నన్ను విడిచి పెట్టారు.. ఇంకా చాలా మంది చట్ట విరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారు. వారందరిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాను’ అన్నారు ముఫ్తీ. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది.

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్‌ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ప్రభుత్వ చర్యను సవాల్‌ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్‌ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్‌ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం.(చదవండి: చైనా పాలనే నయం అనుకునేలా..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top