నేటి నుంచి టాయ్‌ట్రైన్‌ పునఃప్రారంభం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టాయ్‌ట్రైన్‌ పునఃప్రారంభం

Published Sat, Nov 4 2023 5:44 AM

Matheran toytrain services Relaunch - Sakshi

సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్‌ టాయ్‌ట్రైన్‌ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్‌ ప్రారంభించేందుకు సెంట్రల్‌ రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చింది. ఈ మేరకు నేరుల్‌–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్‌ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు.

మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్‌ లాడ్జీ–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్‌ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్‌ రైళ్లను నడపనున్నారు.

వర్షాకాలంలో నిలిపివేత..  
సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్‌ ట్రైన్‌ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు  పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు.

నేరుల్‌ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్‌ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది.  అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్‌ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్‌ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్‌ ట్రైన్‌ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement