Bengaluru: షారిఖ్‌పై ఉగ్ర ముఠాల గురి?.. రహస్యాలన్నీ చెప్పేస్తాడని భయం

Mangaluru blast: Suspected Terrorist gangs conspiring to kill Shariq - Sakshi

రేవు నగరిలో బాంబు విస్ఫోటం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ పేలుడులో ప్రాణాలతో దొరికిపోయిన ఉగ్ర అనుమానితుడు షారిఖ్‌ వద్ద విలువైన సమాచారం పోలీసులకు లభిస్తోంది. బడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ తాళం అతని వద్ద ఉందని ఎన్‌ఐఏ కూడా విచారిస్తోంది. ఇక షారిఖ్‌ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదనుకున్న ఉగ్రవాద ముఠాలు అతన్ని హతమార్చాలని కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. 

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ పేలుడు నిందితుడు షారిఖ్‌ను అంతమొందించాలని ఉగ్రవాద ముఠాలు ప్లాన్‌ వేసినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి షారిఖ్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రి చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఓ ఉగ్రవాద సంస్థ చేసిన పోస్ట్‌లో షారిఖ్‌ను హత్య చేయాలనేలా కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి. స్లీపర్‌ సెల్స్‌ ఉగ్రవాదులు ఈ దాడి చేసే అవకాశం ఉంది.

షారిఖ్‌ వల్ల తమ రహస్యాలన్నీ పోలీసులకు చేరిపోతాయని, అందరూ ఇబ్బందుల్లో పడతామని, కాబట్టి అతన్ని హతమారిస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోతుందని ఉగ్రవాదుల ఆలోచనగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి గదుల వద్ద మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి వచ్చి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. షారిఖ్‌ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.   

ఫోన్లో బాంబుల తయారీ,  ఐసిస్, అల్‌ఖైదా వీడియోలు  
నిందితుడు షారిఖ్‌ మొబైల్‌లో 12 వందల వీడియోలు బయట పడ్డాయి. ఇందులో బాంబ్‌ను ఎలా తయారు చేయాలనే వీడియోలతో పాటు ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాదుల వీడియోలు ఉండటం పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇతడు అనేక చోట్ల భారీ మొత్తాల్లో నగదు వ్యవహారం చేశాడు. నాలుగేళ్ల నుంచి బాంబ్‌ తయారీ కోసం తపించేవాడని, కొన్నిసార్లు ఉన్మాదంగా ప్రవర్తించేవాడని షారిఖ్‌ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు.

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని తన స్వగ్రామంలో బాంబ్‌ను తయారు చేసి పేల్చిన సంగతి బయట పడింది. చిన్నవయస్సులోనే దారి తప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు రోజున షారిఖ్‌తో పాటు బ్యాగ్‌ తగిలించుకొని వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నా జాడ లేదు.  

వలస కార్మికులపై నిఘా  
దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చిన కారి్మకుల వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. ఇసుక తరలింపు, రబ్బర్, వక్కతోటలు, సిమెంట్, టైల్స్, గ్రానైట్, హోటల్, బార్లు, ఎస్టేట్లలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: స్వామీజీ  
తీరప్రాంతంలో అనుమానాస్పదమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా పెట్టాలని ఉడుపి పేజావర విశ్వప్రసన్నతీర్థ స్వామి ప్రజలను హెచ్చరించారు. అయన సోమవారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కుక్కర్‌ బాంబ్‌ పేలుడు తరువాత కరావళిలో జరుగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కరావళి ప్రాంతాలలో అనేక జాతర, తిరునాళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు.    

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top