మమతా బెనర్జీయే మా సుప్రీం లీడర్‌ | Mamata Banerjee must remain supreme leader, not adviser | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీయే మా సుప్రీం లీడర్‌

Jun 5 2026 1:32 AM | Updated on Jun 5 2026 1:32 AM

Mamata Banerjee must remain supreme leader, not adviser

ఆమెను సలహాదారు పదవికి పరిమితం చేయొద్దు 

తిరుగుబాటు ఎమ్మెల్యేల డిమాండ్‌  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షంగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం గుర్తింపు పొందిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరంలో తొలిసారిగా అసంతృప్తి వ్యక్తమైంది. మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలిగా కొనసాగాలని పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒకవేళ ఆమెను కేవలం సలహాదారు పదవికే పరిమితం చేస్తే, తిరుగుబాటు వర్గంలో ఉండాలో వద్దో పునరాలోచన చేస్తామని తేల్చిచెప్పారు. 

కొత్తగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం వారిలో భిన్న స్వరాలు  వ్యక్తమయ్యాయి. తమ వ్యతిరేకత అభిషేక్‌ బెనర్జీపైనే తప్ప మమతా బెనర్జీపై కాదని పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోనే కొనసాగాలని రెబెల్‌ ఎమ్మెల్యే గుల్షన్‌ ములిక్‌ తేల్చిచెప్పారు. సలహాదారుగా వ్యవహరించాలని మమను రితబ్రత కోరారు. ఈ అంశాన్ని కొందరు రెబెల్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే రితబ్రత వర్గంలో విభేదాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ పట్ల తమ విధేయతలో ఏ మార్పూ లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంకేతాలిచ్చారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement