టాటా ఆస్పత్రికి వంద ఇళ్లు

Maharashtra Govt To Give 100 MHADA Flats To Mumbai Cancer Hospital - Sakshi

ప్రతిపాదనకు ముఖ్యమంత్రి 

ఉద్ధవ్‌ ఠాక్రే ఆమోద ముద్ర 

కేన్సర్‌ రోగుల బంధువుల కోసం కేటాయిస్తున్నట్లు వెల్లడి 

30 ఏళ్ల పాటు ఏడాదికి రూపాయి చొప్పున అద్దె ఇచ్చేట్లు ఒప్పందం

సాక్షి, ముంబై: ముంబై నగరంలో ప్రముఖ టాటా మెమోరియల్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగుల బంధువులు బస చేయడానికి 100 ఇళ్లు అందజేసే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సంతకం చేశారు. దీంతో రోగుల బంధువులకు త్వరలో ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే 30 ఏళ్ల వరకు నామమాత్రపు అద్దె ఒప్పందంపై ఈ ఇళ్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నారు. మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో వంద ఫ్లాట్లను టాటా ఆస్పత్రికి అందజేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. కేన్సర్‌ రోగుల వెంట వచ్చే బంధువులకు తల దాచుకునేందుకు తాత్కాలికంగా ఓ గూడు లభించనుంది. 300 చదరపుటడుగుల ఒక్కో ఇల్లుకు సంవత్సరానికి రూపాయి అద్దె చొప్పున 30 ఏళ్ల వరకు వంద ఇళ్లను టాటా ఆస్పత్రికి ఇవ్వనుంది.  

కేన్సర్‌ చికిత్సలో దిట్ట .. 
ముంబైలోని పరేల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న టాటా మెమోరియల్‌ ఆస్పత్రి కేన్సర్‌ చికిత్సకు పెట్టింది పేరు. భారతదేశంతోపాటు విదేశాలలో కూడా ఈ ఆస్పత్రి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో చేరిన రోగుల్లో సుమారు 90 శాతం మంది వ్యాధి నయమై ఇంటికి డిశ్చార్జి అవుతారనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో ఈ ఆస్పత్రి అందించే చికిత్సపై రోగులందరికి నమ్మకం ఉంది. మహారాష్ట్రతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్, ఈశాన్య రాష్ట్రాలు తదితర దేశం నలుమూలల నుంచి నిత్యం వందలాది కేన్సర్‌ రోగులు వస్తుంటారు. ఇందులో 61 శాతం మన దేశానికి చెందిన రోగులుండగా 39 శాతం విదేశాల నుంచి వచ్చినవారుంటారు. ప్రతీ రోగి వెంట ఒకరు లేదా ఇద్దరు బంధువులు కచ్చితంగా వస్తారు. దీంతో ఈ ఆస్పత్రి 24 గంటలు రోగులు, రోగుల బంధువుల రాకపోకలతో రద్దీగా కనిపిస్తుంది.

రోగులకు సేవలు చేయడానికి వార్డులో ఒకరికే అనుమతి ఉంటుంది. అది కూడా అవసరమైతేనే. లేదంటే బయటకు పంపిస్తారు. మిగతావారు ఆస్పత్రి బయట గడపాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కొత్తగా వచ్చిన రోగుల ప్రాథమిక పత్రాల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత రక్త, మూత్ర, కాలేయం తదితర ల్యాబ్‌ పరీక్షలతోపాటు, సోనోగ్రఫీ, ఎక్స్‌ రే, సిటీ స్కాన్‌ లాంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అందుకు సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 నుంచి నెల రోజుల సయమం కూడా పట్టవచ్చు. డాక్టర్లు రిపార్టును పరిశీలించిన తరువాత రోగిని ఆస్పత్రిలో చేర్చుకోవాలా...? వద్దా...? అనేది నిర్ణయిస్తారు. కొందరికి మందులు రాసిచ్చి ఇంటికి పంపిస్తారు. రోగిని ఆస్పత్రిలో చేర్చుకున్న తరువాత ఒకరు మినహా మిగతా బంధువులు ఆస్పత్రి బయటే ఉండాల్సి ఉంటుంది. అదే చిన్న పిల్లలైతే తల్లిని వెంట ఉండేందుకు అనుమతిస్తారు. తండ్రి మాత్రం బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది.

రోడ్లపైనే వంటలు.. 
సాధారణంగా కేన్సర్‌ వ్యాధి నయమం కావాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే గెస్ట్‌హౌస్‌లు, లాడ్జింగులు, హోటళ్లలో బస చేస్తారు. కానీ, పేదలు ఆస్పత్రి బయట రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై లేదా ఫ్లై ఓవర్ల కింద, ఉద్యానవనాల్లో కాలం వెల్లదీస్తారు. కొందరు ప్రతీరోజు అస్పత్రి క్యాంటిన్‌లో, బయట హోటళ్లు, రోడ్లపై విక్రయించే చిరుతిళ్లు తినలేక ఫుట్‌పాత్‌లపైనే ప్లాస్టిక్‌ కాగితాలు కట్టుకుని పోయ్యి వెలిగించి వంట కూడా చేసుకుంటారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి గజగజ వణుకుతూ కాలం వెల్లదీస్తారు. కొన్ని స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు మానవత్వం ప్రదర్శించి ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం, రాత్రి అల్పహారం, భోజనం పంపిణీ చేస్తాయి. కానీ, తల దాచుకునేందుకు ఏర్పాట్లు మాత్రం ఎవరు చేయడం లేదు. దీంతో కరీ రోడ్‌ ప్రాంతంలో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం భవనంలో వంద ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సంతకం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

స్థానికుల వ్యతిరేకత.. 
100 ఫ్లాట్లు కేన్సర్‌ రోగుల వెంట వచ్చే నిరుపేదలు తల దాచుకునేందుకు ఎంతో దోహదపడతాయని మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ అన్నారు. ఒక్కో ఫ్లాటు ఖరీదు రూ. కోటి ఉంటుంది. ఇలా వంద ఫ్లాట్లకు రూ.100 కోట్లు విలువ ఉంటుందని ఆయన అన్నారు. కానీ కరీ రోడ్‌లో మాడా ఆధీనంలో ఉన్న హాజీ కాసం చాల్‌ నివాసులు వంద ఫ్లాట్లు టాటా కేన్సర్‌ ఆస్పత్రికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో కేన్సర్‌ రోగుల బంధువులు బస చేస్తారు. వారి వెళ్లిపోగానే ఇంకొకరు వస్తారు. వారి రాకపోకల వల్ల తమ కుటుంబాలకు కేన్సర్‌ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోపిస్తున్నారు. దీంతో మరోచోట వారికి బస ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top