సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

Maharashtra: Anil Deshmukh Resigns As Home Minister - Sakshi

ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కీలక మలుపు తిరిగింది. మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అతడిపై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు పంపించారు.

హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తీరుపై ముఖ్యమంత్రికి పరమ్‌వీర్‌ సింగ్‌ ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పురమాయించారంటూ పరంబీర్‌ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అనిల్‌ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్‌ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ పదేపదే మంత్రి అనిల్‌ కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్ల ఫండ్‌ కలెక్ట్‌ ఎలా చేయాలో కూడా సచిన్‌ వాజేకు చెప్పినట్లు పరమ్‌బీర్‌ సింగ్‌ లేఖలో తెలిపారు.

అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఇంకా ఆమోదించలేదు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ రాజీనామాకు అంగీకారం తెలపడంతోనే అనిల్‌  ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

చదవండి: వాజే టార్గెట్‌ వంద కోట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top