తోడు నిలవని మహిళలు
మద్దతుగా రాని ముస్లింలు
చేయిచ్చిన మల్లాలు
60 సీట్లలో పోటీచేసి 6 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
ఆర్జేడీ పార్టీని వదలని జంగిల్‌రాజ్ మచ్చ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌డీఏ కూటమిపై ఓట్ల చోరీ విమ ర్శనాస్త్రం సంధించి, బిహార్ యువత, మహిళలు, ముస్లింలు, మల్లాలుసహా ప్రతి వర్గంపై హామీల వరద పారించిన మహాగఠ్‌బంధన్ కూటమి గెలు పుపై పెట్టుకున్న గంపెడాశలు గంగపాలయ్యాయి. ముఖ్యంగా ‘ఎం ఫ్యాక్టర్’గా పిలిచే మహిళలు, ముస్లింలు, మల్లాలు తమకు ఓట్ల పోరులో తోడుగా నిలబడి విజయకేతనం ఎగరేస్తా రనుకుంటే అధికార కూటమికి విజయపతాకం కట్టబెట్టి విపక్ష కూటమి కంగుతినేలాచేశారు.
కుటుంబానికో ప్రభు త్వ ఉద్యోగం, వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకణ ఇలా అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించిన మహాగఠ్‌బంధన్ కూటమి బిహారీల మనసుల్ని గెల్చుకోలేకపోయింది. ఎన్నికలకు ఆరు నెలల నుంచి ముందునుంచి సీట్ల పంపకాలపై చర్చలు మొదలైనా అవి అధికార ఎన్‌డీఏతో పోలిస్తే వేగంగా తేలలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దు బాటు సరిగా కుదర్లేదు. కొన్ని స్థానాల్లో విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో ఘోరంగా విఫల మయ్యాయి.
కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటా పోటీగా ఒకే స్థానంలో పోటీకి దిగి ఇద్దరూ ఓడిపో యారు. ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య చీలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార పర్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల సమన్యయ లోపం సైతం కూటమి విజయావకాశాలను దెబ్బతీశాయి.
తమ ఎన్నికల హామీతో అండగా ఉంటారనుకున్న మహి ళలు హఠాత్తుగా చేయివ్వగా, తమతో కలిసివస్తార నుకు న్న ముస్లింలు ఇరువర్గాల వైపు చీలిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపినా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ చీఫ్ ముఖేశ్ సహానీ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆ పార్టీకి చెందిన మల్లా వర్గపు ఓటర్లు సైతం విపక్షకూటమి వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా ఎన్నో కారణాలు విపక్షాలను విజయతీరాలకు చేర్చకుండా మధ్య లోనే ముంచేశాయి.
అండగా నిలవని ముస్లింలు..
బిహార్‌లో 10 కోట్ల జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభాలో 17.7 శాతమున్న ముస్లింలు కేవలం మహాగఠ్‌బంధన్‌కు ఓటేయకుండా అధికారకూటమి వైపూ మొగ్గుచూపారు. దీంతో ఓట్లు భారీగా చీలిపోయి మహాగఠ్‌బంధన్ విజయావకాశాలు పూర్తిగా నశించాయి. 243 స్థానాలకుగాను 87 స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అందుకే 20 చోట్ల మహాగఠ్‌బంధన్ ముస్లింలకు సీట్లిచ్చింది. అయినాసరే ఇక్కడ మొత్తంగా గెల్చింది ఐదు సీట్లే.
ముస్లింలకు 14 శాతం జనాభా ఉన్న యాదవులు కలిస్తే ఓటు బ్యాంక్ 32 శాతానికి పెరిగి తమకు బాగా కలిసి వస్తుందని మహాగఠ్‌బంధన్ వేసిన లెక్కలు తారుమార య్యాయి. దళిత, ఆదివాసీలు కలిసొస్తే కనీసం 40 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించింది. వాస్తవంలో కాంగ్రెస్‌కు కేవలం 8 శాతం, ఆర్జేడీకి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా చాలా స్థానాల్లో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. అనేక చోట్ల బీఎస్పీకి 4 నుంచి 6 శాతం ఓట్లు వచ్చింది.
కొత్తగా ఏర్పడిన జనసురాజ్ పార్టీ మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బతీసింది. విపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో ముస్లిం ఓట్లు జనసురాజ్ పార్టీ చీల్చింది. సీమాంచల్‌లో 11 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెలిచింది. 60 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 చోట్ల మాత్రమే గెలిచింది. అధిక శాతం ఉన్న ముస్లింలను కాదని, మల్లా వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం సైతం ముస్లింలకు కోపం తెప్పించింది.
దర్భంగా, మధుబని, సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్‌పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు భారీగా చీలిపోయాయి. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీకి చెందిన మల్లా వర్గం ఓటర్లు మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామడి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలలో ఎక్కువ. ఆయా జిల్లాల్లో గెలుపుపై విపక్షకూటమి గంపెడాశలు పెట్టుకుంటే కేవలం 18 చోట్ల గెలిచింది. వీఐపీ పార్టీ మల్లాలు అధికంగా ఉన్న 15 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్లా ఓడింది.
పెరిగిన ఓట్ల శాతం శరాఘాతమే..
మహిళా ఓటర్లు తమ వెంటే ఉన్నా రని కూటమి తొలినుంచీ భావిస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 66.91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇందులో మహిళా ఓటర్లలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మహిళలే రాష్ట్రంలో అధికంగా గెలుపోటములను నిర్దేశించారని తేటతెల్లమైంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 1.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లో నితీశ్ ప్రభుత్వం ఏకంగా ఒకేసారి రూ.10,000 నగదు జమచేయడంతో వాళ్లంతా అధికార పార్టీకే కొమ్ముకాశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉచిత సైకిల్ పథకం వంటివి ఎన్‌డీఏకు కలిసొచ్చాయి. ఇవి విపక్షాలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి.
ఆర్థికంగా వెనుకబడిన మహి ళలకు ఏటా రూ. 30వేల ఆర్ధిక సాయం, జీవికా దీదీల ఉద్యో గాల క్రమబద్ధీకరణ, రూ. 30 వేల గౌరవవేతనం, ‘మా’ (ఇల్లు, వంట సరుకులు, ఆదాయం) పథకం ప్రతి మహిళకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినా మహిళలు విపక్షాల మాటలను నమ్మలేదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ఆటవికంగా పరిపాలించారంటూ ఎన్‌డీఏ కూటమి చేసిన ప్రచారాన్ని జనం గుర్తుంచుకుని ఆర్జేడీ మాటలను విశ్వసించడం మానేశారు. కాంగ్రెస్ వరస వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాత వ్యూహాలనే అమలు చేయడం సైతం విజయపథంలో దూసుకుపోకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.


