ఈశా వేడుకల్లో సింగర్‌ మంగ్లీ స్వరాలు

Maha Shivaratri  Celebrations : Mangli Going To Perform At Isha foundation - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సంగీత ప్రపంచంలో గాయని మంగ్లీది ప్రత్యేక స్థానం అని చెప్పనవసరం లేదు.  జానపదాలు మొదలు బతుకమ్మ పాటల వరకు తన గానామృతంతో అందరినీ అలరిస్తోంది. ప్రతి పండుగకు తన కొత్త పాట సందడి చేయాల్సిందే. తన యాసతో ప్రకృతి, సంస్కృతి మిళితమైన జానపదాలు మొదలు సినిమా పాటల్లోనూ దూసుకుపోతుంది. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో ఎవరికీ దక్కని అవకాశం మంగ్లీకి దక్కింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదికైన కోయంబత్తూర్‌లోని  ఈశా ఫౌండేషన్‌ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో తన గొంతును వినిపించనుంది. ప్రతి శివరాత్రికి ఈశా యోగా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరగడం విదితమే.

అయితే ఈసారి కోవిడ్‌ కారణంగా isha.sadhguru.org/msrలో ఇంగ్లిష్‌తో పాటు 11 భారతీయ భాషల్లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాశివుడిని స్మరిస్తూ ఐదు పాటలు పాడనున్నట్లు మంగ్లీ తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పార్థివ్‌ గోహిల్, ఆంధోని దాసన్, కబీర్‌ కేఫ్, సందిప్‌ నారాయణ్‌ తదితరులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top