రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్‌ హైకోర్టు నోటీసులు

Madras High Court Issued Notices To CMi Palaniswami - Sakshi

 డీఎంకే నేత దావా 

సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. సీఎంపై డీఎంకే నేత సూళూరు ఎ. రాజేంద్రన్‌ పరువు నష్టం దావా వేయడంతో కోర్టు స్పందించింది. ప్రతిపక్షాల నేతలు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే చాలు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చటుక్కున కోర్టుల్లో పరువునష్టం దావాలు వేయడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నం అన్నట్టుగా సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత రాజేంద్రన్‌ దావా వేయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కోయంబత్తూరు వేదికగా సీఎం పళనిస్వామి రాజేంద్రన్‌ను టార్గెట్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైలులో ఓ యువతిపై లైంగిక దాడి యత్నం చేశాడని ఆరోపించారు. దీనిని రాజేంద్రన్‌ తీవ్రంగా పరిగణించారు. తాను చేయని నేరాన్ని, తనపై వేస్తూ, పరువుకు భంగం కల్గించే రీతిలో సీఎం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా వేశారు. 

నోటీసులు.. 
ఇటీవల తాను రైలులో పయనిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్ర విసర్జన నిమిత్తం పై బెర్త్‌ నుంచి కింది బెర్త్‌కు దిగాల్సి వచ్చిందని, ఆ సమయంలో కింద ఉన్న యువతిపై జారిపడ్డానని ఆ దావాలో వివరించారు. తనకు మధుమేహం ఉందని, అందుకే మూత్ర విసర్జన కోసం అత్యవసరంగా పరుగులు తీశానని, అయితే, తానేదో అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా భావించిన ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పరిస్థితిని ఆ యువతికి వివరించినానంతరం ఆమె శాంతించారని గుర్తు చేశారు.

అయితే హఠాత్తుగా తనపై పదిహేను రోజుల అనంతరం పోలీసులు కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో కోర్టు సైతం తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టు వివరించారు. అయితే, ఎన్నికల సమయంలో తానేదో రైలులో లైంగిక దాడి యత్నం చేసినట్టుగా సీఎం ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన పరువుకు భంగం కల్గించే రీతిలో ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోటి నష్టపరిహారం కోరుతూ సీఎం పళనిస్వామికి దావా ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి పార్థిబన్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందు గురువారం  విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సీఎం పళనిస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి ఎస్పీ వేలుమణిపై కూడా రాజేంద్రన్‌ దావా వేశారు. 

చదవండి: ‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top