
భోపాల్: నాగ పామును మెడకు చుట్టుకొని, బైక్ నడుపుతూ సాహసం చేయబోయిన ఓ వ్యక్తి అదే పాము కాటు వేయడంతో మృతిచెందాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని దీపక్ మహావర్‌గా గుర్తించారు. పాముతో బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపక్ స్థానిక జేపీ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పాములను పట్టడంలో నేర్పరిగా పేరుంది.
వేలాది పాములను రక్షించి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేశాడు. ఇటీవల నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని అందరికీ చూపించాలని భావించాడు. అందుకే మెడకు చుట్టుకొని బైక్ నడిపాడు. కానీ, పాము అతడిని కాటు వేసింది. దీపక్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా తీసుకురావడంతో రక్షించలేకపోయామని డాక్టర్లు చెప్పారు. దీపక్ భార్య గతంలోనే మృతిచెందారు. అతడికి రౌనక్, చిరాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వారు అనాథలుగా మారిపోయారు.
