స్కూటర్‌పైనే స్కూలు: టీచర్‌ వినూత్న ప్రయోగం

Madhya Pradesh: A govt school teacher has set up a mini library - Sakshi

సాక్షి, భోపాల్‌: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలకారణంగా ఆన్‌లైన్‌ చదువులకు  పరిమితం కావల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ సదుపాయాలు, స్మార్ట్‌ఫోన్‌లు లేక గ్రామీణ ప్రాంత  పేద విద్యార్థులు పడ్డ కష్టాలు, ఆవేదన ఇంతా అంతాకాదు. స్మార్ట్‌ఫోన్‌లు కొనే స్తోమత లేక చాలామంది విద్యను కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో అటు  ఉపాధ్యాయులు కూడా ఇబ్బందలునెదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు, వారిల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు పలువురు ఉపాధ్యాయులు వినూత్న  ఆలోచనలతో ముందుకు రావడం మనం చూశాం. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ  వార్తల్లోనిలిచారు.

పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను కొనివ్వడమేకాదు, తనకున్న పరిమితమైన వనరులతో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. శ్రీవాస్తవ తన స్కూటర్‌పై మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి సాగర్‌లోని వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇక్కడ చాలామంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులున్నారు. వారికి స్మార్ట్‌ఫోన్‌లు కొనలేని కారణంగా ఆన్‌లైన్ విద్యను పొందలేకపోతున్నారు అందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాదు చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కూడా  పెద్ద సమస్య. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, తన విద్యార్థులకు 5 స్మార్ట్‌ఫోన్‌లను కొని ఇచ్చానని, అలాగే పుస్తకాలు కొనలేని విద్యార్థులకు బుక్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు. తన లైబ్రరీలోని పుస్తకాలను 2-3 రోజులు ఉంచుకోవచ్చని వెల్లడించారు. ఏది ఏమైనా పిల్లలు చదువుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల అపురూప బంధాన్ని గుర్తు చేసు కుంటున్నారు. 

 


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top