
‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్
పిండి పదార్థాలను అతిగా తినటంతో ‘కొవ్వుల’ భారం
ఫలితంగా షుగర్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి జబ్బులు
వీటికి చెక్ పెట్టే ‘లో కార్బ్ హై ఫ్యాట్’ ఆహార పద్ధతి
రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది.
అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హై ఫ్యాట్’ – ఎల్‌సీహెచ్‌ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు. – సాక్షి, సాగుబడి
పిండి పదార్థాలను ఎక్కువగా తింటే..
మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.
» ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్‌గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది
» గ్లైకోజెన్.. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.
» గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం.
» పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హై ఫ్యాట్ (ఎల్‌సీహెచ్‌ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు.
కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..
ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.
ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?
ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). ఎల్‌సిహెచ్‌ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. 10 కిలోల బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..
» నికర పిండి పదార్థాలు – 20 గ్రా. (పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి)
» మాంసకృత్తులు – 70 గ్రా.
» ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.
ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు ఉండాలి.
» ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి.
» ప్రతి మనిషికి.. వారివారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.
నేనూ వాడి.. లబ్ధి పొందాను
నేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే ఆహారం వాడకం ప్రపం^è వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచింది. నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు.
రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ నుంచి తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించారో చాలా వీడియోలు కూడా చేశాను. - డా. పి.వి. సత్యనారాయణ, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎస్‌సీహెచ్‌ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్