
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.
ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.