ఎంపీలకు కరోనా పరీక్షలు

Lok Sabha Speaker advises MPs to get COVID-19 test done 72 hours - Sakshi

సమావేశాలకు మూడురోజుల ముందే చేయించుకోవాలి: స్పీకర్‌

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 72 గంటల ముందే లోక్‌సభ సభ్యులందరూ కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కోరారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14 న ప్రారంభమై, అక్టోబర్‌ 1కి ముగియనున్నాయి. ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్‌ కోరారు.

పార్లమెంటరీ సమావేశాల ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎయిమ్స్, డీఆర్‌డీఓ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో లోక్‌సభ స్పీకర్‌ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులెవ్వరినీ ముట్టుకోకుండా, జీరో టచ్‌ సెక్యూరిటీ చెక్‌ ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ తెలిపారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే కోవిడ్‌ పరీక్షలు సైతం నిర్వహిస్తామని స్పీకర్‌ చెప్పారు. రెండు షిఫ్టులలో ఉదయం, సాయంత్రం వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. పార్లమెంటు భవనానికి లోక్‌సభ స్పీకర్‌ సంరక్షకుడు కాగా, ఈ భవనానికి లోక్‌సభ సెక్రటేరియట్‌ నోడల్‌ అథారిటీగా వ్యవహరిస్తుంది. కనుక పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్‌ మీదనే ఉంటుంది.   

ప్రశ్నలడిగే అధికారాన్ని హరించవద్దు
సెప్టెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగే, ప్రజాసమస్యలను ప్రస్థావించే సభ్యుల అధికారాలను హరించరాదంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకి, కాంగ్రెస్‌ ప్రతిపక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరి లేఖ రాశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్‌లను కుదించటం, ప్రత్యేకించి కోవిడ్‌ సంక్షోభ కాలంలో మంచిది కాదని ఛౌదరి స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రానున్న సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్‌ సమయాన్నీ కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందనీ, సభ్యులు అడిగే ప్రశ్నల సంఖ్యను కూడా కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. జీరో అవర్‌లో, జాతీయ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సభ్యులు లేవనెత్తటం సహజంగా జరిగే ప్రక్రియ అని, ఆయన రాసిన లేఖలో తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు అడగకుండా, ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్‌ సమయాన్నీ కుదించటం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకనుగుణంగా లేవని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు యథావిధిగా ప్రశ్నలడిగే అవకాశం కల్పించాలని స్పీకర్‌కి రాసిన లేఖలో కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top