Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్‌వే | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్‌వే

Published Sat, Apr 13 2024 6:23 AM

Lok Sabha Elections 2024: Uttar pradesh Impact On Gate Way On Hasthina - Sakshi

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు 

యూపీని కొల్లగొట్టే పార్టీదే అధికారం

2014, 2019ల్లో పూర్తిగా బీజేపీ హవాయే 

కలిసొస్తున్న మోదీ, యోగి ‘డబుల్‌ ఇంజన్‌’ 

ముస్లిం ఓట్లపైనే ఇండియా కూటమి ఆశలు

పూర్తయిన కాంగ్రెస్, ఎస్పీ సీట్ల పంపకం

ఉత్తరప్రదేశ్‌. లోక్‌సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి.

స్టేట్‌ స్కాన్‌
దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు...

ఈ ఎన్నికలు అత్యంత కీలకం...   
ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

యూపీలో క్లీన్‌ స్వీప్‌ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్‌ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది.

ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్‌(ఎస్‌) 2 సీట్లు గెలిచింది.

బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్‌ఎల్‌డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్‌బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్‌ జరుగుతోంది.

అయోధ్య..  బీజేపీ బ్రహా్మస్త్రం
ఈసారి 400 పైగా లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే.

యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్‌ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్‌ సింగ్‌ మనుమడు జయంత్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్‌ నింపింది. చరణ్‌ సింగ్‌కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్‌ (ఎస్‌)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు.

‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా?   
విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్‌ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్‌ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి.

ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్‌ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్‌ఎల్‌డీ గుడ్‌బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా.

ముస్లింల రూటెటు?   
యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్‌సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్‌ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్‌ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర, అఖిలేశ్‌ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి.

సర్వేలు ఏమంటున్నాయి...?
యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి.   

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement