ఆందోళన ఆగలేదు.. సభ సాగలేదు

Lok Sabha Adjourned, 2 Bills Introduced Amid Opposition Uproar Over Pegasus, Farm Laws - Sakshi

పార్లమెంట్‌లో కొనసాగిన నిరసనలు

న్యూఢిల్లీ: పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు దిగిరాకపోవడంతో శుక్రవారం కూడా పార్లమెంట్‌ ఎలాంటి చర్చలు జరగకుండా సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ఆరంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు యథాత«థంగా నిరసనకు దిగారు.  ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభాపతి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.  ప్రతిపక్షాల ఆందోళనపై సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అసహనం వ్యక్తం చేశారు. పెగసస్‌పై వివాదం అనవసర రగడని, ప్రజా సంబంధ విషయాలపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై ఐటీ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ వివరణ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

కానీ విపక్షాలు తమకు మరింత వివరణ కావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని జోషి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు బిల్లులు చర్చలేకుండా ఆమోదం పొందాయని, ఇకనైనా విపక్షాలు కీలక అంశాలపై చర్చకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్షాలు వినకపోవడంతో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ఆరంభమవగానే ప్రభుత్వం రెండు బిల్లుల(కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇన్‌ ఎన్‌సీఆర్‌ బిల్‌ 2021, జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌)ను సభలో ప్రవేశపెట్టింది. వీటిపై చర్చించాలని ప్రభుత్వం, సభాపతి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కానీ స్లోగన్లతో సభ సాగకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు.  

రాజ్యసభలో సేమ్‌ సీన్‌
శుక్రవారం రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో చర్చలు సాగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభారంభం కాగానే విపక్షాల నిరసనతో మధ్యాహ్నంలోపు రెండు మార్లు వాయిదా పడింది. పార్లమెంట్‌ మర్యాద, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని విపక్షాల తీరుపై సభాపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మంత్రుల ముందు విజిళ్లు వేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం మర్యాదకాదన్నారు. ప్రతిఒక్కరూ సభా మార్యాద పాటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్ష సభ్యులు వినలేదు. అనంతరం ఆయన జీరో అవర్‌ ఆరంభించారు. కానీ విపక్షాలు సభను సాగనివ్వలేదు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ తిరిగి ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి స్లోగన్లతో సభను అడ్డుకున్నారు. దీంతో తిరిగి సభ మరలా వాయిదా పడింది. లంచ్‌ తర్వా త సభలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో ఒక బిల్లును ప్రతిపక్ష ఆందోళన మధ్యనే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తదనంతరం సభ సోమావారానికి వాయిదా పడింది.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top