Liquor Scam: ఫోన్‌ను నాశనం చేశారు.. మళ్లీ విచారించాలి: ఈడీ

Liquor Policy Case: Sisodia Destroy His Phone Says ED To Court - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ఈడీ కస్టడీని పొడిగించింది ఢిల్లీ స్పెషల్‌ కోర్టు. ఈ మేరకు శుక్రవారం కస్టడీని ఐదురోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 

ఈడీ ఆయన్ని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరు పర్చింది. మార్చి 20వ తేదీతో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుండగా.. తమ రిమాండ్‌ను మరో వారం పొడగించాలని ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది.  వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లిక్కర్‌ స్కాం సమయంలో.. సిసోడియా తన ఫోన్‌ను నాశనం చేశారని, కాబ్టటి ఆయన్ని మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ.

కిందటి ఏడాది జూలై 22వ తేదీన.. అంటే ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే మనీశ్‌ సిసోడియా తన ఫోన్‌ను ఉన్నపళంగా  మార్చేశారు. ఆ ఫోన్‌ను ఏం చేశారనేది కూడా విచారణ టైంలో ఆయన ఈడీకి తెలియజేయలేదు. సిసోడియా మెయిల్స్‌, మొబైల్‌ ఫోన్‌లను ఫోరెన్సిక్‌పరంగా విశ్లేషించడంతో పాటు  కస్టడీ సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయని ఈడీ కోర్టుకు వెల్లడించింది.  

సిసోడియా కంప్యూటర్‌ నుంచి డాక్యుమెంట్లలలో మార్చి 2021కి సంబంధించి డాక్యుమెంట్‌లో ఐదు శాతం కమిషన్‌ అని పేర్కొని ఉందని, ఆపై సెప్టెంబర్‌ 2022కి సంబంధించిన మరో డాక్యుమెంట్‌లో 12 శాతం పెంపుదల గురించి ప్రస్తావన ఉందని ఈడీ కోర్టుకు వెల్లడించింది. అంతేకాదు.. సౌత్‌ లాబీ తరపునే ఇదంతా జరిగిందని వివరించింది. ఈ తరుణంలో.. 

సిసోడియా తరపు న్యాయవాది జోక్యం చేసుకుని.. సీబీఐ, ఈడీలు ఇవే వాదనలు వినిపిస్తున్నాయని, కొత్తగా ఏవీ వినిపించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు తన క్లయింట్‌(సిసోడియా)ను గత వారం రోజుల్లో మొత్తంగా 12 నుంచి 13 గంటలు మాత్రమే ప్రశ్నించారని కోర్టుకు తెలిపారాయన. 

అయితే.. ఈడీ మాత్రం ప్రతీరోజూ ఆయన్ని ఐదు నుంచి ఆరు గంటలు ప్రశ్నించినట్లు, గురువారం సైతం ఆరు గంటలు విచారించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫేటేజ్‌ సైతం ఉన్నట్లు కోర్టుకు వెల్లడించింది. దీంతో ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో.. రిమాండ్‌ పొడగింపుపై తీర్పును రిజర్వ్‌ చేసిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. కాసేపటికే ఐదు రోజుల పొడిగింపు విధిస్తున్నట్లు తెలిపింది. 

లిక్కర్ పాలసీ రూపకల్పన- అమలులో జరిగిన అక్రమాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, చేతులు మారిన ముడుపులు, మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన,డీలర్ కమిషన్ 12 శాతానికి పెంపు, సౌత్ గ్రూప్ సహా నిందితులతో ఉన్న సంబంధాలపై సిసోడియాని ఈడీ తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్‌ స్కాంలో సీబీఐ ఆయన్ని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్‌ చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top