
అడవిలో ఆహారపు కొరత
ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూతో పందులు మృతి
కుక్కల కోసం గ్రామాలకు వస్తున్న చిరుతపులులు
ఆత్మకూరురూరల్: చిరుత పులి ఎలాంటి ప్రాంతంలోనైనా ఉండగలదు. దట్టమైన నల్లమలలలోను, చిట్టడవులు మాత్రమే ఉన్న ఎర్రమలలోను, కంప చెట్లు, రాతి కొండలు ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పశి్చమ ప్రాంలో హాయిగా బతికేస్తున్నాయి. అలాగే హైదరాబాదు, బెంగళూరు, ముంబయ్ లాంటి నగరాల శివార్లలోనూ జీవించ గలుగుతున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల చిరుతల సంచారం కనిపించడం, ప్రజల్లో కొంత ఆందోళన కలగడం జరుగుతోంది
ఆహారం కోసమే..
గ్రామాల పరిసరాల్లో చిరుతలు సంచరించడం సహజమైనదే. చిన్నపాటి దాక్కునే ప్రదేశం ఉన్నా చిరుతలు తమనుతాము దాచుకుని ఎవరికి కనిపించకుండా మనుగడ సాగించగలవు. పంట పొలాల్లో ఉండే కుందేళ్ళు, అడవి పందుల పిల్లల వంటి వన్యప్రాణులతో పాటు గ్రామాల్లోని కుక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఇటీవలి కాలంలో రాళ్ల కొండల్లో, పొదల్లో చిరుతల ఆహారం తగ్గి పోవడంతో అనివార్యంగా గ్రామాల వైపు చిరుతలు వస్తూ జనం కంట పడుతున్నాయి. గొర్ల మందల వద్ద ఉన్న కుక్కలను, ఆవుల మందల్లో ఉండే దూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతలు ఆహార సేకరణ చేస్తుంటాయి.
ఇదీ కారణం..
శ్రీశైలం మహాక్షేత్రంలో ఇటీవల చిరుత పులులు కాలనీల్లోని ఇళ్లలోకి కూడా వచ్చాయి. దీన్ని సునిశితంగా పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు దీనికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ సంబంధిత వ్యాధి కారణమని తేల్చారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ పందులలో సంక్రమిస్తుంది. సున్నిపెంటలో కొందరు నడుపుతున్న పందుల ఫాంలోకి బెంగళూరు నుంచి తెచ్చిన పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చేరింది. ఈ పందులనుంచి ఆ వైరస్ అడవి పందులపై ప్రభావం చూపడంతో పెద్ద సంఖ్యలో అడవి పందులు మరణించాయి.
పంది పిల్లలే ముఖ్య ఆహారంగా తీసుకునే చిరుతలకు దీనివల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీంతో చిరుతలు అనివార్యంగా కుక్కలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని శ్రీశైలంలోకి తరుచూ వచ్చేవి. శ్రీశైలం దేవస్థానం వారు చిరుత ఆహారపు కొరతను గమనించకుండా పుణ్యక్షేత్రంలో సంచరించే కుక్కలను పట్టి వేరే ప్రాంతంలో వదిలారు. దీంతో చిరుతలు సున్నిపెంటల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్స్, ఇతర పెంపుడు జంతువులకోసం ఏకంగా ఇళ్ళలో ప్రవేశించ సాగాయి.
రైతులకు ఎంతో మేలు
చిరుత పులులు అడవి పందులను తిని రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అడవి పందులు తమ సంతతిని విపరీతంగా పెంచుకుని మైదాన ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇవి రైతుల పంటలను సర్వ నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అయితే అడవి పంది పిల్లలను అమిత ఇష్టంగా వేటాడి తినడం చిరుత ప్రత్యేకత. అందుకే చిరుత పులులు రైతుల పొలాల వెంట సంచరిస్తూ పంది పిల్లల కోసం మాటు వేస్తుంటాయి. అలా పందులసంఖ్యను నియత్రించడం ద్వారా చిరుతలు రైతులకు మేలు చేస్తుంటాయి. కాగా.. చిరుత పులి తన ఆహార జంతువుల జాబితాలో మనిíÙని ఎంచుకోలేదు. రెండు కాళ్ల జంతువులు పులుల ఆహారపు మెనూలోనే లేవు.
కోసిగి ప్రాంతంలో ఇటీవల ఒక చిరుత పంట పొలాల్లో మత్తుగా పడి ఉండడం స్థానికులు గమనించారు. దాన్ని వెంటాడి బంధించే ప్రయత్నం చేశారు. ఆ చిరుత పులి ఆ తరువాత మరణించింది. దాన్ని పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు తేలి్చన సత్యం ఏమిటంటే అది ఏదో జంతువును వేటాడినపుడు ఎముక ఒకటి దాని పేగులకు పొడుచుకుని ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. అది పడుకుని ఉండగా బంధించే యత్నం చేయడంతో ఆ జంతువు ఆందోళనకు గురై హృదయ స్పందన ఆగి మృతిచెందింది.
ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. అడవిలో ఆహారపు కొరతతోనే అవి గ్రామాలవైపు వస్తున్నాయి.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ శివారులో ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడం ఇటీవల సంచలనం రేపింది. తాను వేటాడిన ఆహారాన్ని దాచుకునేందుకు చిరుతలు చెట్లు ఎక్కుతుంటాయి. అలాగే ఇతర జంతువుల నుంచి ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా చెట్లు ఎక్కుతుంటాయి. అయితే తిప్పలదొడ్డి వద్ద ప్రజల సందడికి భయపడి రక్షణ కోసం చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది.