
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర ముప్పు
మొత్తం 4.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
44% మధ్యస్థ, అధిక ముప్పు ఉన్న ప్రాంతం
మ్యాపింగ్ చేసి ప్రభావం గుర్తించిన జీఎస్‌ఐ
కొండచరియలు విరిగిపడి పలువురి మృతి.. నిలిచిపోయిన రాకపోకలు.. యాత్రికుల అష్టకష్టాలు.. ఇలాంటి వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరుగుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ముప్పు ఉండే ప్రాంతాలను గుర్తించడంతోపాటు నష్ట నివారణ చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
పశ్చిమ బెంగాల్‌లోని మిరిక్, డార్జిలింగ్ హిల్స్‌లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి అక్టోబరు 5న 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి.
⇒ ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వైష్ణోదేవీ ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగిపడి సుమారు 30 మంది మరణించారు.
⇒ జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమా చల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే కొండచరియలు విరిగి పడటం చాలాసహజం. ఆ సమయాల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు.
⇒ 2024 జూలైలో కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు కూలిన ఘటనల్లో ఏకంగా 260కిపైగా చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
మ్యాపింగ్ చేసిన జీఎస్‌ఐ
కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ఎతై ్తన కొండ ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) దేశవ్యాప్తంగా మ్యాపింగ్ చేసింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముప్పు ప్రాంతాలు విస్తరించాయి.
ముప్పును బట్టి..
కొండచరియలు విరిగిపడే ముప్పు తీవ్రతను బట్టి తక్కువ, మధ్య, అధిక ప్రాంతాలుగా జీఎస్‌ఐ విభజించింది. ఇందులో 63 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అధిక ప్రమాద జోన్‌లో ఉందని తేలింది. అలాగే 1,26,000 చ.కి.మీ. మధ్యస్థంగా, 2,45,000 చ.కి.మీ. తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతంగా వెల్లడించింది. హిమాచల్ ప్ర దేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్.. అధిక ప్ర మాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా ప్రకటించింది.
అధిక స్పష్టతతో..
రిమోట్ సెన్సింగ్, క్షేత్రస్థాయి సిబ్బంది ఆధారంగా కొండచరియలు విరిగిపడ్డ 91,000 సంఘటనల సమాచారాన్ని జీఎస్‌ఐ సేకరించింది. 33,904 ఘటనలను ధ్రువీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గుర్తించిన 200 కీలక ప్రాంతాల్లో మరింత అధునాతన మీసో–స్కేల్ మ్యాపింగ్‌కు శ్రీకారం చుట్టింది. వీటిలో ఈ ఏడాది మార్చి నాటికి 160 ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది. 2028లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. పెళుసైన కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, జోనింగ్ నిబంధనలు, కమ్యూనిటీ భద్రతకు ఈ అధిక స్పష్టత కలిగిన మ్యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి.
ముందస్తు హెచ్చరికలు
ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొండచరియల ముప్పు అంచనా సామర్థ్యాలను పెంచుతోంది. వాతావరణ శాఖ, ఇతర సంస్థల సహకారంతో జీఎస్‌ఐ అభివృద్ధి చేసిన ‘ప్రాంతీయ కొండచరియల అంచనా వ్యవస్థ (ఆర్‌ఎల్ ఎఫ్‌ఎస్)’.. వర్షపాతం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ముందస్తు హెచ్చరికలను అందిస్తోంది. జీఎస్‌ఐ ఈ సంవత్సరం రుతుపవనాలు ప్రారంభం కాగానే ఎనిమిది రాష్ట్రాల్లోని 21 జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ఉన్నాయి.
దేశంలో కొండచరియల ముప్పు తీవ్రతను బట్టి విస్తీర్ణ శాతం
తక్కువ 56
మధ్యస్థం 29
అధికం 15