‘కాక్రోచ్‌’కి పోటీగా ‘లాల్‌ హిట్‌’ | Lal Hit Janata Party rallies at Janpath against abusive language | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌’కి పోటీగా ‘లాల్‌ హిట్‌’

Oct 10 2026 6:33 AM | Updated on Oct 10 2026 6:33 AM

Lal Hit Janata Party rallies at Janpath against abusive language

ప్రధాని మోదీపై దూషణలను నిరసిస్తూ ఢిల్లీలో భారీ ర్యాలీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జనపథ్‌ ప్రాంతం శుక్రవారం భారీ ర్యాలీకి వేదికైంది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) శనివారం జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే, బొద్దింకలు వంటి వాటిని చంపే కీటక నాశిని పేరుతో తాజాగా అవతరించిన లాల్‌ హిట్‌ జనతా పార్టీ(ఎల్‌జేపీ) పోలీసులపై దాడులను, ప్రధాని మోదీని కించపరచడాన్ని ఖండించింది. 

జనపథ్‌ ప్రాంతానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో చేరుకున్న ఈ పార్టీ సభ్యులు..‘మనవాళ్లెవరైనా సంబంధం లేని బయటి వారిని దూషిస్తున్నా వద్దంటూ వారిస్తుంటాం. అలాంటిది, మన కుటుంబంలోని వ్యక్తి అయిన ప్రధాని మోదీని అనుచిత పదజాలంతో దూషించడం ఏమాత్రం సరికాదు. మన ప్రముఖులను, జవాన్లను, ఢిల్లీ పోలీసులను దూషించడం ఆపేయాలి. ఇలా దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’అని ఆ పార్టీకి చెందిన అయాన్‌ భట్నాగర్‌ కోరారు. 

వ్యవస్థలో మార్పు రావాలంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు తప్పుడు మార్గంలో సాగుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు, చట్ట న్యాయం అమలయ్యేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కాపాడేందుకే నిరసన చేపట్టామని భట్నాగర్‌ తెలిపారు. సీజేపీ వ్యవహరిస్తున్న తీరు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాలన వంటి ప్రజాస్యామ్య సంస్థల గౌరవాన్ని దిగజార్చేలా ఉందని ఆరోపించారు. 

ఈ ర్యాలీలో పాల్గొన్న వారిని పోలీసులు నిర్బంధించి, బస్సుల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుచిత చర్యలుగా భావించిన వాటిపై ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా వ్యతిరేకిస్తామని ఎల్‌జేపీ అనంతరం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నేటి యువత ముఖ్యంగా జెన్‌ జెడ్‌ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాలుపంచుకోవాలని, అభిప్రాయ బేధాలకు వాస్తవ సమాచారం, శాంతియుత నిరసనలు, ప్రజాచైతన్యం, చట్టానికి లోబడి ఉండే పరిష్కారం కనుగొనాలని ఎల్‌జేపీ పిలుపునిచ్చింది. దేశమే ప్రథమం, రాజ్యాంగానికి గౌరవం, ప్రజాస్వామ్యమే మనకు గుర్తింపు’అనేదే తమ నినాదమని ఎల్‌జేపీ వివరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement