
న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను మంత్రిమండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ సభ్యులతో కలిసి సభలో ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అజయ్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ లఖీంపూర్ ఖేరీ ఘటనతో మిశ్రాకు సంబంధం ఉందని ఆరోపించారు. అజయ్ మిశ్రాను తొలగించాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు అనుమతినివ్వాలని కోరారు. అయితే ముందుగా అనుకున్నట్లు రాహుల్ ఎంఎస్‌ఎంఈపై ప్రశ్నకు మాత్రమే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.
చదవండి: కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు
అయితే మిశ్రాను శిక్షించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. ఇదే సమయంలో పలు ప్రతిపక్షాల సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం బయోడైవర్సిటీ బిల్లు పత్రాలను ప్రభుత్వం సభముందుకు తెచ్చింది. అటవీ ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో బయోడైవర్సిటీ సవరణ చట్టం –21ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. అంతకుముందు సభ ఆరంభంలో ఇటీవల మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు నివాళులర్పించారు.
ఇటీవల 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. అదేవిధంగా లఖీంపూర్ ఘటనను కూడా కాంగ్రెస్‌సభ్యులు లేవనెత్తారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. నిరసనల మధ్య పీడీపీ బిల్లుపై జాయింట్ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. సభ్యుల ఆందోళన తగ్గకపోవడంతో సభను మరుసటిరోజుకు వాయిదా వేశారు. సభ ఆరంభంలో విజయ్ దివస్ వీరులకు సభ్యులు నివాళి అర్పించారు.