
ముంబై: సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కొల్హాపురి చెప్పుల డిజైన్‌ను అనుమతి లేకుండా వాడుకున్న ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడాపై పిల్ దాఖలైంది. మేధో సంపత్తి హక్కుల రంగంలో పనిచేసే ముంబై, పూణేలకు చెందిన న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఈ సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ ఏఐ ఉత్పత్తిని అనధికారికంగా ఉపయోగించడాన్ని అంగీకరిస్తూ, ప్రాడా గ్రూప్, ప్రాడా ఇండియా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఏఐలను అనధికారికంగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని పిటిషన్ కోరింది. భారతీయ కళాకారుల హక్కులను గుర్తించాలని డిమాండ్ చేసింది. కళాకారుల ప్రతిష్ట, ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా పిటిషన్ కోరింది.
జూన్ 22న ఇటలీలోని మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్.. స్ప్రింగ్ సమ్మర్ మెన్స్ కలెక్షన్–2026 సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ను ప్రాడా బ్రాండ్ ఉపయోగించింది. ఫ్యాషన్ షో వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రదర్శనలో ప్రాడా మోడల్స్ ధరించిన పాదరక్షలు అచ్చం సంప్రదాయ కొల్హాపురి చెప్పుల మాదిరిగానే ఉన్నాయి. వాటి డిజైన్లకు శతాబ్దాల వారసత్వం కలిగిన సంప్రదాయ పాదరక్షల నుంచి ప్రేరణ పొందినట్టు ప్రాడా కూడా అంగీకరించింది.