50 ఏళ్ల క్రితం రూ.2000తో ‘లూనా’ లాంచ్‌... ఇప్పుడు ఏ అవతారంతో వస్తున్నదంటే...

kinetic luna electric to be called e luna - Sakshi

దేశంలో ఎలక్ట్రికల్‌ వాహనాలకు అంతకంతకూ డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో నూతన స్టార్టప్‌లు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇదేసమయంలో పలు పాత కంపెనీలు కూడా మార్కెట్‌లో నూతన హంగులతో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 80-90 దశాబ్ధాలలో తన హవా చాటిన లూనా గురించి అందరికీ తెలిసేవుంటుంది. అదే లూనా ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్త హంగులతో వచ్చేందుకు సకల సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి లూనా ఎలక్ట్రిక్‌ అవతారంలో పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వానీ సోషల్‌ మీడియా మాధ్యమంలో తెలియజేశారు.

ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో తన తండ్రికి సంబంధించిన పాత ఫొటోతో పాటు లూనా వింటేజ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. దానిలో బ్లాస్ట్‌ ఫ్రమ్‌ ద పోస్ట్‌!!‘చల్‌ మేరీ లూనా’. దీని రూపకర్త నా తండ్రి, పద్మశ్రీ అరుణ్‌ ఫిరోదియా!కైనెటిక్‌ గ్రీన్‌ కు ఆధునిక మార్పులు చేస్తూ‘ఈ- లూనా’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దీనికిముందు బజాజ్‌ ఆటో కూడా తన ప్రముఖ స్కూటర్‌ చేతక్‌ను పాత నేమ్‌ ప్లేట్‌తోనే ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అలాగే ఎల్‌ఎంఎల్‌ కూడా ఇదే ఏడాది తన స్టార్‌ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌ అవతార్‌లో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

ఎలక్ట్రిక్‌ లూనా అంటే ఈ- లూనా.. ఇది కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ వవర్‌ సొల్యూషన్‌ ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించనున్న తొలి మోడల్‌. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కంపెనీ నెలకు 5 వేల ‘ఈ లూనా’లను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కైనెటిక్‌ తన ఎలక్ట్రిక్‌ లూనా కోసం మరో అసెంబ్లీ లైన్‌ నెలకొల్పుతోంది. కంపెనీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ఈ- లూనాలను ఉత్పత్తి చేయనుంది. కాగా కైనెటిక్‌ లూనా నాటి కాలంలో ఎంతో ఆదరణ పొందింది. దీనిని కైనెటిక్‌ ఇంజినీరింగ్‌ తొలిసారి 1972లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

సుమారు 50 సీసీ ఇంజను సామర్థ్యం కలిగిన ఈ వాహనం దేశంలో తొలి మోపెడ్‌గా పేరొందింది. తరువాతి కాలంలో టీఎఫ్‌ఆర్‌, డబల్‌ ప్లస్‌, వింగ్స్‌, మేగ్నం, సూపర్‌ పేర్లతో రకరకాల వేరియంట్స్‌లో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లూనాను తొలిసారి మార్కెట్‌లోకి తీసుకువచ్చినప్పుడు దీని ధర రూ.2,000. 1972లో వచ్చిన ఒరిజినల్‌ లూనా పియాజియో సియావో మోపెడ్‌కు చెందిన లైసెన్స్‌డ్‌ వెర్షన్‌. దీని తరువాత 2000 దశకం తొలినాళ్లలో లూనా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు కైనెటిక్‌ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top