వైరల్‌: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?

Karnataka Man Living In His Hindustan Ambassador For The Past 17 Years - Sakshi

బెంగళూరు: కొన్ని సందర్భాల్లో చాలామందికి మనుషులకు, సమాజానికి, టెక్నాలజీకి దూరంగా ఒంటరిగా బతకాలని అనిపిస్తుంది. కానీ అది ఆలోచన వరకే.. ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంగా చుట్టూ ఎవరూ లేకుంటే జీవించలేం, పిచ్చిలేస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 17 ఏళ్లుగా ఇంటికి దూరంగా అడవిలో జీవిస్తున్నారు. మరి ఇన్నేళ్లుగా జనజీవనానికి దూరంగా అడవిలో బతికేందుకు కారణం ఏమయ్యుంటుందో ఇప్పుడు చుద్దాం. 

క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు అడ‌వుల్లో 56 ఏళ్ల చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తి గ‌త 17 ఏళ్లుగా ఒంట‌రిగా నివాసం ఉంటున్నాడు. అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడ‌వుల్లో ప్ర‌యాణం చేస్తుంటే అడ‌విలో  చిన్న మార్గం ప‌క్క‌న ప్లాస్టిక్ క‌వ‌ర్ క‌ప్పిన గుడిసే క‌నిపిస్తుంది. అందులో ఒక‌ప్ప‌టి అంబాసిడర్‌ కారు ఉంటుంది. ఆ గుడిసెలోని కారులోనే చంద్ర‌శేఖ‌ర్ నివ‌సిస్తున్నాడు. తలపై భారీగా పెరిగిన జుట్టు, రెండు జతల బట్టలు, ఒక జత రబ్బరు చెప్పులతోనే, చంద్రశేఖర్ జీవిస్తున్నాడు. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఇతని వద్ద ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి. 

అయితే చంద్రశేఖర్‌ ఇంతకముందు ఇలా జీవించేవాడు కాదు. ఇతనికి  17 ఏళ్ల క్రితం ఆయ‌న‌కు నెక్ర‌ల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎక‌రాల భూమి ఉండేది. 2003లో సాగు నిమిత్తం ఆయ‌న స్థానిక స‌హ‌కార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు.  అయితే, కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆయ‌న త‌న బాకీ తీర్చ‌లేక‌పోయాడు. దీంతో అధికారులు ఆయ‌న పొలాన్ని వేలం వేశారు. ఇది భరించలేని..చంద్రశేఖర్ తన కిష్టమైన కారు తీసుకుని సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత సోదరితో విబేధాలు వచ్చాయి. సొంత గ్రామానికి వెళ్లలే.. ఆత్మగౌరవం అడ్డొచ్చి, తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో అద్దెల్ – నెక్కారే అడవిలోకి వెళ్లిపోయాడు.

అప్పటి నుంచి అడ‌విలో దొరికే కాయ‌లు తింటూ, జ‌ల‌పాతాల వ‌ద్ధ స్నానం చేస్తూ జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్ట‌లు చేసి వాటిని స‌మీపంలోని గ్రామాల్లో అమ్మి వ‌చ్చి డ‌బ్బుతో కావాల్సిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేసుకునేవాడు. విష‌యం తెలుసుకున్న క‌లెక్ట‌ర్ ఆయ‌న్ను క‌లిసి ఇల్లు క‌ట్టిస్తాన‌ని చెప్పినా దానికి చంద్ర‌శేఖ‌ర్ ఒప్పుకోలేదు. త‌న‌కు అడ‌వి చాల‌ని, అక్క‌డున్న జంతువులు త‌న‌ను ఏమీ చేయ‌వ‌ని అన్నారు. అట‌వీశాఖ అధికారులు కూడా చంద్ర‌శేఖ‌ర్‌ కారణంగా అడ‌వికి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top