
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ తీవ్ర ఆందోళన, ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్ గేమింగ్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ చట్టానికి న్యాయస్థానంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. కర్ణాటక హైకోర్టు ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ చట్టం 2025పై ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ A23 కోర్టుకెక్కింది. అత్యవసర విచారించాలన్న సీనియర్ అడ్వకేట్లు ఆర్యామా సుందరం, ధ్యాన్ చిన్నప్పల విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగష్టు 30న ఈ పిటిషన్‌ను విచారించనుంది.
ఈ చట్టం ప్రకారం, నైపుణ్యమా.. అదృష్టమా అనే తేడాల్లేకుండా డబ్బుతో ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్‌ను కేంద్రం నిషేధించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరిరోజే ఈ కీలక బిల్లుకు క్లియరెన్స్ లభించగా.. ఆమరుసటిరోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది.
మరోవైపు ఈ చట్టం కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్రతినిధులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. గేమింగ్‌పై నిషేధం విధించేకంటే.. నియంత్రణ చేయాలని సూచిస్తూ లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ భద్రతకు, ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందంటూ నిషేధ చట్టాన్ని హడావిడిగానే అమల్లోకి తెచ్చింది.
అయితే.. ఈ చట్టం నైపుణ్య ఆధారిత ఆన్‌లైన్ గేమ్స్‌ను కూడా నేరంగా పరిగణించడం ద్వారా బహుళ కంపెనీలు ఒక్కరాత్రిలో మూతపడే ప్రమాదం ఉందని A23 అంటోంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఆ పిటిషన్ సారాంశాన్ని ఉటంకిస్తూ.. ఈ చట్టం state paternalism (రాష్ట్ర పితృత్వ ధోరణి) ఉత్పత్తిగా పేర్కొంది. నైపుణ్య గేమ్స్‌కు వర్తింపజేస్తున్న తరుణంలో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని A23 కోర్టును కోరింది. మరోవైపు ఈ పిటిషన్‌పై స్పందించేందుకు కేంద్ర వర్గాలు నిరాకరించాయి.
దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఈ చట్టం బ్రేకులు వేసింది. సుమారు 70 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ ప్లేయర్లతో ఉన్న A23 కంపెనీ చట్టాన్ని సవాల్‌చేస్తూ కోర్టుకు ఎక్కింది. అయితే.. ఈ కేసు ఫలితం భారత ఆన్‌లైన్ గేమింగ్ రంగ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్-2025 ముఖ్యాంశాలు:
'ఆన్‌లైన్ గేమింగ్' చట్టం ప్రకారం డబ్బుతో ఆడించే అన్ని అన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పూర్తిగా నిషేధించినట్టయింది.
డబ్బుతో ఆడే గేమ్స్ నడపడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కాగ్నిజబుల్, బెయిల్ లేని నేరాలుగా పరిగణించబడతాయి.
నేరస్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే చాన్స్ ఉంది. నేరాలు రిపీట్ అయితే రూ.2 కోటి వరకు జరిమానా, కనీస శిక్ష విధిస్తారు.
ప్రకటనలకు ప్రచారం చేసినా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల వరకూ జరిమానా ఉంటుంది.
బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు వంటి ఆర్థిక సంస్థలు నిషేధిత గేమ్స్‌కు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయడం నిషేధం.
జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసి గేమ్స్‌ను నమోదు చేసి, పర్యవేక్షణ చేయనుంది కేంద్ర ఐటీ శాఖ. అయితే..
డబ్బు ప్రమేయం లేని ఈ-స్పోర్ట్స్‌కు మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్‌ను ఆడుకోవచ్చు.