‘ఈ నెల 25 తరువాత పతాకస్థాయికి కోవిడ్‌.. అయినా లాక్‌డౌన్‌ ఉండదు’

Karnataka: Govt Says Covid Cases May Peak in January Last Week - Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో వారం రోజుల నుంచి భారీఎత్తున నమోదవుతున్న కరోనా ఉధృతి కొనసాగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,156 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 7,827 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 14 మంది కోవిడ్‌తో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 32,47,243 కరోనా కేసులు రాగా, 29,91,472 మంది డిశ్చార్జి అయ్యారు.  మొత్తం మరణాలు 38,445 కి పెరిగాయి. కరోనా పాజిటివిటీ 12.45 శాతంగా నమోదైంది. 0.05 శాతంగా మరణాల రేటు ఉంది. అయితే గత రెండురోజులతో పోలిస్తే కరోనా కేసులు కొంచెం తగ్గాయి. వారాంతపు లాక్‌డౌన్‌ ఇందుకు కారణమని భావిస్తున్నారు.  

బెంగళూరులో 1.57 లక్షల యాక్టివ్‌ కేసులు  
యథా ప్రకారంలో బెంగళూరులోనే ఎక్కువ కరోనా కేసులు సంభవించాయి. 15,947 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 4,888 మంది కోలుకోగా, ఐదుమంది మరణించారు. ప్రస్తుతం బెంగళూరులో 1,57,254 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,17,297.  కొత్తగా 2,16,816 డోస్‌ల టీకాలు వేయగా, 2,17,998 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కరోనా నూతన రూపం ఒమిక్రాన్‌ కేసులు విస్తరిస్తున్నాయి. కొత్తగా 287 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 766 కి పెరిగాయి. 
చదవండి: కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే

లాక్‌డౌన్‌ ఉండబోదు 
బనశంకరి: ఈ నెల 25 తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్‌ పతాకస్థాయికి చేరుకుంటుందని నిపుణులు తెలిపారు. వీకెండ్‌ లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై త్వరలో చర్చిస్తాని రెవిన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ చెప్పారు. సోమవారం ఆయన సీఎంతో సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడుతూ వీకెండ్‌ కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూ గురించి శుక్రవారం సీఎం నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు అవి కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని అన్నారు. లాక్‌డౌన్‌ గురించి చర్చించామని, సీఎంతో పాటు పలువురు మంత్రులు లాక్‌డౌన్‌ వద్దని అభిప్రాయపడ్డారని తెలిపారు.  

144 సెక్షన్‌ పొడిగింపు  
బెంగళూరులో ఈ నెల 19 వరకు అమల్లో ఉన్న 144 సెక్షన్‌ నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు విస్తరించారు. ఎలాంటి సభలు, సమావేశాలు జరపడానికి వీలు ఉండదు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top