
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది.
సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.
జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.
కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.
జరిగింది ఇదే..
జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
- 2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
- 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి.
- 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది.
- 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్‌లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లోని పాక్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి.
- 2025 మే 16న హర్యానాలోని హిసార్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది.
- పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు.