గల్ఫ్ కార్మికుల కష్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్

Justice NV Ramana Bench Issued Notice To 16 States About Gulf Employees - Sakshi

న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రా సహా భారత కార్మికుల దుస్థితి పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై కేంద్రం వైఖరిని కోరాలన్న విజ్ఞప్తి కి స్పందించిన జస్టిస్ ఎన్వి రమణ బెంచ్ ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ర్టాలకు నోటీసులు జారీ చేసింది.

సరైన జీతాలు లేక గల్ఫ్ దేశాల్లో కార్మికులు వేధింపులకు గురవుతున్నారని బసంత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటీషన్‌లో వివరించారు. గల్ఫ్ దేశాల్లో యజమానులు కార్మికులతో వెట్టిచాకిరి చేయించి సరెైన వేతనాలు చెల్లించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో వేదింపులకు కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని పిటిషనర్ పేర్కొన్నారు. 

జస్టిస్ ఎన్ వి రమణ బెంచ్ విచారణ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. దేశానికి భారీగా విదేశీ మారకం తేవడం ద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవడంలేదని వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎన్ వి రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఎలా ఆదేశాలు ఇవ్వలేమని ప్రశ్నించారు. భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని అభిప్రాయపడ్డారు. 

దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రావణ్ కుమార్, తాను కేవలం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రం లోనే కాకుండా అంతర్రాష్ట్ర, విదేశాల్లో కార్యకలాపాలు చేస్తున్నాయి కాబట్టి వారిపై సిబిఐ విచారణ జరపాలని కూడా కోరుతున్నామని వివరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top