మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు

Judge harassment charge in open letter goes viral - Sakshi

గౌరవప్రదంగా చనిపోవాలనుందంటూ సీజేఐకి బాధితురాలి లేఖ

అలహాబాద్‌ హైకోర్టు నుంచి నివేదిక కోరిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించారు.

జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top