జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ టాపర్‌ చిరాగ్‌

JEE Advanced Result 2020 declared - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థికి రెండో ర్యాంకు

మూడో ర్యాంకు దక్కించుకున్న బిహార్‌ విద్యార్థి వైభవ్‌రాజ్‌  

న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ)–అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్‌ ఫలోర్‌ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్‌ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు.

మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్‌ ఫలోర్‌ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్‌   కనిష్కా మిట్టల్‌ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు.

ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్‌    
జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్‌ ఫలోర్‌ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్‌ పొందానని,  ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్‌ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్‌ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే  చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్‌ ఫలోర్‌ ఢిల్లీని ప్రగతి పబ్లిక్‌ స్కూల్, పుణేలోని సెయింట్‌ ఆర్నాల్డ్‌ సెంట్రల్‌ స్కూల్‌లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌ ఇంటర్నేషనల్‌ ఒలంపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్‌ మ్యాథమెటిక్స్‌ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

జాతీయ స్థాయిలో టాప్‌ 10 ర్యాంకర్లు...
1.    చిరాగ్‌ ఫాలర్‌ (మహారాష్ట్ర)
2.    గంగుల భువన్‌ రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌)
3.    వైభవ్‌రాజ్‌ (బిహార్‌)
4.    ఆర్‌.మహేందర్‌రాజ్‌ (రాజస్తాన్‌)
5.    కేశవ్‌ అగర్వాల్‌ (హరియాణా)
6.    హర్ధిక్‌ రాజ్‌పాల్‌ (తెలంగాణ)
7.    వేదాంగ్‌ ధీరేంద్ర అస్గోవాంకర్‌ (మహారాష్ట్ర)
8.    స్వయం శశాంక్‌ చూబే (మహారాష్ట్ర)
9.    హర్షవర్ధన్‌ అగర్వాల్‌ (హరియాణా)
10.    ధ్వనిత్‌ బేనీవాల్‌ (హరియాణా) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top