
ఉగ్ర నెట్‌వర్క్ నిర్వీర్యం దిశగా కీలక ముందడుగు: కశ్మీర్ పోలీసులు
శ్రీనగర్: ఏప్రిల్ 22వ తేదీన కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడ్డ ముష్కరులకు సాయం అందించాడనే ఆరోపణలపై పోలీసులు మహ్మ ద్ యూసుఫ్ కటారి(26) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ)గా పనిచేస్తున్న ఇతడు ఆ ఉగ్ర వాదులను నాలుగుసార్లు కలిశాడని, వారికి ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌ను అందించాడని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆధారం దొరకడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
రిసార్టు పట్టణం పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముష్కరులను సులేమాల్ అలియాస్ ఆసి ఫ్, జిబ్రాన్, హమ్‌జా అఫ్గానీగా గు ర్తించారు. వీరిని శ్రీనగర్ వెలుపల ఉన్న జబర్వాన్ కొండల్లో మూడు, నాలుగు పర్యాయాలు కలుసుకు న్నట్లు ఇతడు విచారణలో వెల్ల డించాడన్నారు. విషాదం చోటుచేసుకున్న ప్రాంతంలో లభించిన వివిధ వస్తువుల్లో సగం ధ్వంసమైన ఛార్జెర్ కూడా ఉంది. దీన్ని ఎవరు, ఎవరికి విక్ర యించారనే విషయంపై జరిపిన దర్యాప్తులో కటారి విషయం వెలుగు చూసిందన్నారు.
అక్కడి కొండ ప్రాంతాలపై గట్టి పట్టున్న కటారి విద్యార్థులకు గైడ్ గా వ్యవహరిస్తుంటాడు. అదే సమయంలో, ఇతడు ఉగ్రవాదులకు సైతం మార్గదర్శిగా ఉంటూ, వారికి అవసరమైన సెల్ ఛార్జెర్ వంటి వాటిని సమకూ ర్చాడు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు మద్దతిచ్చే నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంలో కటారి అరెస్ట్ ముఖ్యమైన ముందడుగుగా పోలీసులు భావిస్తు న్నారు. కాగా, బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహ దేవ్ సమయంలో పహల్గాం ముష్కరులు ముగ్గు రూ హతమవడం తెల్సిందే. పహల్గాం ఉగ్ర ఘటన వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసే లక్ష్యంతో విచారణ సాగిస్తున్న జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్‌ఐఏ) ఇప్పటికే ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చా రన్న ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసింది.