రంకెలేసిన ఉత్సాహం..

Jallikattu Bull Festival In Tamil Nadu - Sakshi

జోష్‌గా జల్లికట్టు

ఉరకలేసిన వీరులు...

పరుగులెత్తిన కోడెగిత్తలు

వందమందికిపైగా గాయాలు 

సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు జోష్‌గా ప్రారంభమయ్యాయి. రంకెలేస్తూ పరుగులు పెడుతున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు జల్లికట్టు వీరులు ఉరకలేసారు. కొందరు విజేతలుగా నిలవగా మరికొందరు తీవ్రగాయాలకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అలాగే శుక్రవారం మాట్టు పొంగల్‌ను కోలాహలంగా జరుపుకున్నారు.       పొంగల్‌ పండుగలో భాగంగా మదురై జిల్లా అవనియాపురంలో గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జల్లికట్టు పోటీలు జరిగాయి. 922 కోడెగిత్తలతోపాటు, 430 మంది జల్లికట్టు వీరులో టోకెన్లు పొందారు. మంత్రి సెల్లూరురాజా నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ అన్బళగన్, ఎమ్మెల్యేలు రాజన్‌సెల్లప్ప, శరవణన్‌ జెండా ఊపి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. గంటకు 50 మంది వీరులను జల్లికట్టు చట్రంలోకి అనుమతించారు.

విజేతలకు ఖరీదైన గృహోకరణ వస్తువులు, సైకిల్, మొబైల్‌ఫోన్లను బహూకరించారు. అలాగే మదురై జిల్లా పాలమేడులో శుక్రవారం జల్లికట్టు పోటీలను రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ ప్రారంభించారు. ఒక్కో రౌండ్‌కు 75 మంది చొప్పున 639 మంది వీరులు పాల్గొన్నారు. కరోనా సర్టిఫికెట్‌ పొందిన వారిని మాత్రమే పోటీలకు అనుమతించారు. మాట్టు పొంగల్‌లో భాగంగా చెన్నైలో శుక్రవారం 120 పశువులు, గొర్రెలకు పూజలు చేశారు.     కానుం పొంగల్‌ను పురస్కరించుకుని శనివారం కడలి అంచుల్లో ఆటపాటలపై ప్రభుత్వం నిషేధం విధించింది. చెన్నై మెరీనాబీచ్, కోవలం, నీలాంగరై బీచ్‌లు, మహాబలిపురం పర్యాటక కేంద్రం ప్రాంతాలకు చేరుకోరాదని, ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్‌శాఖ హెచ్చరించింది. చెన్నై మెరీనాబీచ్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటూ సందర్శకులకు అనుమతి లేదు. 

గాయాలు.. కత్తిపోట్లు..
మదురైలో జల్లికట్టు పోటీకి కోడె గిత్తలను తరలించే విషయంలో గొడవ తలెత్తగా అరుణ్‌కుమార్‌ (29), దేవేంద్రన్‌ (25) కత్తిపోట్లకు గురయ్యారు. ఈకేసులో కార్తికేయన్‌ (18), ప్రకాష్‌ (18) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేలూరు జిల్లాలో జల్లికట్టు రిహార్సల్స్‌లో పాల్గొని విజేతగా నిలిచిన కోడె గిత్తలను ఆటో ఢీకొట్టడంతో వాటి వీపు ఎముకలు విరిగిపోయాయి. పశువైద్యులు వాటికి ఏడుగంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మదురై జిల్లా పాలమేడు, అవనియాపురంలో గురు, శుక్రవారాల్లో జరిగిన జల్లికట్టు పోటీల్లో కోడెద్దులు కుమ్మడంతో వందమందికి పైగా వీరులు గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్బంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రూ.416 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. గురువారం ఒక్కరోజు రూ.269 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. రూ.56.39 కోట్ల మద్యం అమ్మకంతో తిరుచ్చిరాపల్లి ప్రథమస్థానంలో నిలిచింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top