
న్యూఢిల్లీ: ఇస్రో అత్యంత కీలకంగా భావించిన భూమి పరిశీలన ఉపగ్రహాన్ని ఆదివారం విజయవంతంగా ప్రయోగించలేకపోయింది. దానిని మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ61(PSLV-C61) గాలిలోకి ఎగిరిన ఏడు నిమిషాలకే విఫలమయ్యింది. దీనికి కారణాన్ని కనుగొనేందుకు ఇస్రో జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాకెట్‌కు సంబంధించిన ఆడిట్ జరుగుతోంది. దానిలోని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సభ్యులు ఉన్న కమిటీ నెలరోజులలో దీనిపై నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(Polar Satellite Launch Vehicle) (పీఎస్‌ఎల్‌వీ)లోని ప్రతి విభాగాన్ని పరిశీలించేందుకు ఇస్రో పలు అంతర్గత కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇది అత్యంత విశ్వసనీయమైన రాకెట్. 94 శాతానికి మించిన విశ్వసనీయత కలిగివుంది. అలాగే 63 ప్రయోగాలలో కేవలం నాలుగుసార్లు మాత్రమే వైఫల్యాలను చవిచూసింది.
మూడవ దశలో ఘన ఇంధన మోటారును ఉపయోగిస్తున్నందున పీఎస్‌ఎల్‌వీ మాత్రమే కాకుండా మరే ఇతర రాకెట్ కూడా విఫలం కాలేదని అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాతనే భవిష్యత్ ప్రయోగాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.
