తూచ్‌.. రష్యాకు ఆ డ్రోన్లు మేము ఇవ్వలేదు!

Iranian Envoy Condemns Allegations Of Giving Drones To Russia - Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్ధంలో భారీగా సైన్యాన్నికోల్పోయిన క్రమంలో ఆత్మాహుతి బాంబర్లు(డ్రోన్లు)తో దాడులు చేయటం మొదలు పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌ తయారీ షహీద్‌(జెరాన్‌-2) డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పదుల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రష‍్యాకు డ్రోన్లు సరఫరా చేస్తోందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఇరాన్‌. అయితే.. ఆ ఆరోపణలను ఖండించింది ఇరాన్‌. తాము డ్రోన్లు సరఫరా చేయలేదని కొట్టిపారేసింది. 

రష్యాకు డ్రోన్లు సరఫరా చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు భారత్‌లోని ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ ఇరాజ్‌ ఎలాహి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు, ఇటీవల ఓ ప్రార్థనా స్థలంలో ఐఎస్‌ఐఎస్‌ దాడులపై ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు ఒక్క ఆయుధాన్ని సైతం ఇరాన్‌ సరఫరా చేయలేదు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. రక్షణ రంగంలో సహకారంపై రష్యా-ఇరాన్‌ల మధ్య ఒప్పందం మాత్రమే ఉంది. దాని ఆధారంగా డ్రోన్లు సరఫరా చేసినట్లు పశ్చిమ దేశాల మీడియాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది.’ అని స్పష్టం చేశారు ఇరాన్‌ రాయబారి. 

మరోవైపు.. ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు కొన్ని వర్గాలు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు డాక్టర్‌ ఇరాజ్‌ ఎలాహి. ప్రస్తుతం రెండు ఇరాన్‌లు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ఒకవైపు.. పశ్చిమ మీడియాలు చూపుతున్నది నమ్ముతున్న వారు మరోవైపు అని తెలిపారు. హిజాబ్‌, ప్రభుత్వానికి మద్దతుగా చాలా ర్యాలీలు జరిగాయని..కానీ మీడియాలు దానిని చూపించలేదని ఆరోపించారు. ఇరాన్‌లోని పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ ఛానల్స్‌ను అనుసరించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్‌ డ్రోన్‌ బాంబులు.. 8 మంది మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top