
రంగంలోకి పార్టీ హైకమాండ్ నేతలతో కొప్పుల రాజు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములా టలు, పరస్పర ఆరోపణల పర్వం మరోసారి తెరపైకి వచ్చాయి.కాంగ్రెస్ నేతల విభేదాలు ఢిల్లీ దాకా చేరడంతో, అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొప్పుల రాజుకు అప్పగించింది.
రాష్ట్ర నేతలందరినీ ఆయన ఢిల్లీకి పిలిపించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా, కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు తిర్కీ, ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ, ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్‌లతో ఆయన భేటీ అయ్యారు. జాగ్రత్తగా మసలు కోవాలని, విభేదాలపై రచ్చకెక్కరాదని, సమన్వయంతో కూటమి బలోపేతానికి కృషి చేయాలని వారికి గట్టిగా చెప్పారు.
మూల కారణమిదే..!
రాంచీలోని రిమ్స్ (రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ తొలగింపు అంశం వివాదానికి తెరతీసింది. రిమ్స్ డైరెక్టర్ తొలగింపునకు సంబంధించిన లేఖపై తాను సంతకం చేయనని కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా బహిరంగంగా ప్రకటించారు. ఈ అంశం పార్టీలో ఉద్రిక్తతను సృష్టించింది. పార్టీని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగ వేదికపై అలాంటివి వెల్లడించరాదని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఆయనకు సూచించారు. అయితే, బైతా వెనక్కి తగ్గలేదు.
మరోవైపు, రిమ్స్–2 ప్రతిపాదనపై జార్ఖండ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్–2 కోసం తన ప్రాంతంలోని రైతుల భూమిని సేకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న రిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికే రిమ్స్–2ను తెరపైకి తెచ్చినట్లు సీఎం హేమంత్ సోరెన్ అంటున్నారు. ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంకీర్ణంలో ఉద్రిక్తతలకు దారితీసింది.