ఉపశమనం ఇంతటితో సరి

Interest on interest to be waived during moratorium period - Sakshi

రుణ గ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ కంటే ఇంకేం చేయలేం

సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ అఫిడవిట్లు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్‌ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్‌ జైన్‌ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్‌ 5న న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

పూర్తి వివరాలతో మరో అఫిడవిట్‌ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్‌ జైన్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్‌ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్‌స్టాల్‌మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top