మహారాష్ట్రలో జైళ్లు ఫుల్‌

Inmates Beyond Capacity In All Prisons At Maharashtra - Sakshi

జైళ్లన్నింటిలోనూ సామర్థ్యానికి మించి ఖైదీలు

ఇళ్లనూ అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చంటున్న నిపుణులు 

మరోవైపు ఇప్పటికే 2 వేల మందికిపైగా ఖైదీలకు కరోనా

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడం వల్ల జైళ్లన్నీ కిక్కిర్సిపోయాయి. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీల సంఖ్య తక్కువగా, కొత్తగా చేరే ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడక్కడ ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిని జైళ్లుగా మార్చి అందులో ఖైదీలను ఉంచాల్సిన పరిస్థితి రావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వివిధ రకాల జైళ్లున్నాయి. అందులో తొమ్మిది సెంట్రల్, 28 జిల్లా, 19 ఒపెన్‌ అదేవిధంగా మహిళలు, పిల్లల, ప్రత్యేక, ఇతర నాలుగు ఇలా మొత్తం 60 జైళ్లున్నాయి. ఇందులో 24,032 ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. కానీ, ప్రత్యక్షంగా అందులో వేలాది మంది ఖైదీలున్నారు. 2017–18లో 32,922 మంది ఖైదీలుండగా 2019 మార్చి ఆఖరు వరకు ఈ సంఖ్య 36,366కు చేరుకుందని జైళ్ల శాఖ నిర్వహించిన ఆడిట్‌లో తెలింది.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో 27,264 ఖైదీలుండగా 9,008 మంది శిక్ష పడిన వారున్నారు. ఖైదీలలో 51 శాతం అత్యాచారం, హత్యలు చేసిన నేరస్తులున్నారు. ఇందులో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అపహరణ–హత్య, మోక్కా చట్టం కింద అరెస్టు అయిన ఖైదీలున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరిగింది. కరోనా వైరస్‌ తోటీ ఖైదీలకు సోకకుండా జైలు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న పెరోల్‌ సెలవులను వెంటనే మంజూరు చేయడం, పూచికత్తుపై తాత్కాలికంగా జామీను ఇచ్చి విడుదల చేయడం లాంటివి చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు వివిధ జైళ్ల నుంచి 10,710 మంది ఖైదీలు బయటకు వెళ్లారు. అయినప్పటికీ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఇంకా 28,319 ఖైదీలున్నారు. ఈ సంఖ్య కూడా సామర్థ్యానికి మించి ఉందని తెలుస్తోంది. కానీ, పెరోల్‌ సెలవులు, తాత్కాలిక జామీనుపై బయటకు వెళ్లిన వారు తిరిగి లోనికి వస్తే పరిస్థితి అçప్పుడు జైళ్లలో పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు.    (దీపావళి తర్వాతే పాఠశాలలు ప్రారంభం)

కరోనా విజృంభణ.. 
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న రెండు వేల మందికిపైగా ఖైదీలకు కరోనా మహమ్మారి సోకినట్లు వెలుగులోకి వచ్చింది. అందులో 1,616 మంది బాధితులు కోలుకున్నారని జైలు అధికారులు తెలిపారు. అంతేగాకుండా ప్రస్తుతం కరోనా వైరస్‌ అదుపులో ఉందని, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు అందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, పెద్ద సంఖ్యలో ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. దాదాపు అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. కచ్చా ఖైదీలను సకాలంలో విడుదల చేయకపోవడం, పెరోల్‌ మంజూరు చేయకపోవడం, కోర్టు పూచికత్తుపై విడుదల చేసినా డబ్బులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం తదితర కారణాల వల్ల ఖైదీలు జైలు నుంచి బయటపడలేకపోతున్నారు.

ఫలితంగా జైళ్లన్ని ఖైదీలతో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో జైళ్లలో సామాజిక దూరాన్ని పాటించడం అసంభవమని తెలుస్తోంది. కాగా, మే 31వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో తేరుకున్న జైళ్ల పరిపాలన విభాగం మొత్తం 36 వేల మంది ఖైదీల్లో 14,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. అందులో ఇప్పటి వరకు 2,011 మందికి కరోనా సోకినట్లు కేసులు నమోదయ్యాయి. 1,616 మంది ఖైదీలు కోలుకోగా మిగతా ఖైదీలు జైళ్లలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    (సుప్రీంకోర్టుకు అర్నాబ్‌ భార్య సమ్యాబ్రతా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top