మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌పై సిరా దాడి

Ink Thrown At Maharashtra Minister Patil Over Comments - Sakshi

ముంబై: ఇటీవలే మహాత్మాపూలే, అంబేడ్కర్‌లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి సిరా చల్లాడు. పింప్రీ చించ్‌వడ్‌లో శనివారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అనంతరం సిరా చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ వ్యక్తి ఏ సంస్థకు సంబంధించినవారన్నది తెలియరాలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని సిరా దాడికి పాల్పడినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

ఔరంగాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి పాటిల్‌ మాట్లాడుతూ.. విద్యాలయాల అభివృద్ధి కోసం అంబేడ్కర్‌, పూలేలు ప్రభుత్వ నిధులను కోరలేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు వారు ప్రజల నుంచి డబ్బులు అడుకున్నారని వ్యాఖ్యానించారు. అడుక్కోవడం అనే పదం వాడటం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది.  

వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఆకస్మికంగా పాటిల్‌ ముందుకు వచ్చి సిరా చల్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు పాటిల్‌. తనపై సిరా దాడి జరిగినందుకు బాధపడటం లేదని స్పష్టం చేశారు. ‘అబేడ్కర్‌, పూలేలను నేను ఎప్పుడు విమర్శించాను? వారు ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా.. స్కూల్స్‌ ప్రారంభించేందుకు ప్రజలనుంచి తీసుకున్నారని చెప్పాను. కోర్టులో న్యాయం కోసం అడుకున్నాను అంటే తప్పవుతుందా? సిరా దాడి వల్ల ఏం జరగదు. నా చొక్కా మార్చుకుని వేరే కార్యక్రమానికి వెళ్లాను.’ అని తెలిపారు పాటిల్‌.

ఇదీ చదవండి: క్యాబ్‌లోంచి చిన్నారిని విసిరేసి.. తల్లిపై వేధింపులు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top