
వాషింగ్టన్: అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ భారతీయ మహిళ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో ఆమె చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఈ స్టోర్‌లో ఏడు గంటలపాటు గడిపిన ఈమె అనుమానాస్పద ప్రవర్తనను అక్కడి సిబ్బంది గమనించి, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ రిటైల్ చైన్ నుండి ఆమె లక్షరూపాయలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేసిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు స్టోర్‌లోని బాడీక్యామ్ ఫుటేజ్‌ను సేకరించారు. సదరు మహిళ ఏడు గంటలుగా స్టోర్‌లో తిరగడాన్ని గమనించామని, ఆమె అక్కడి వస్తువులను తీసుకుంటూ, ఫోన్‌ను చూసుకుంటూ చివరికి డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి, స్టేషన్‌కు తరలించారు. ఆమెపై నేరారోపణలు మోపినప్పటికీ, ఇంకా అరెస్టు చేయలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై టార్గెట్ స్టోర్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.