ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి | Indian Newspaper Society urges govt to withdraw IT Amendment Rules 2023 | Sakshi
Sakshi News home page

ఐటీ రూల్స్‌లో సవరణలు ఉపసంహరించండి

Apr 14 2023 6:28 AM | Updated on Apr 14 2023 6:28 AM

Indian Newspaper Society urges govt to withdraw IT Amendment Rules 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడు కేఆర్‌పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్‌ఎస్‌కు ఉందని గుర్తుచేశారు.

మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్‌ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్‌ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్‌ రూల్స్‌లో ప్రస్తావించలేదని కేఆర్‌పీ రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్‌ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్‌లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ మేరీ పాల్‌ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement