
ఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలు విషయాలను పంచుకున్నారు. తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు. భారత్ చేసిన మెరుపుదాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదలు మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని.. కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ తీరు మార్చుకోకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
POK ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ పూర్తిగా ధ్వంసం చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యంపై రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. భారత్ చేసిన దాడిలో పాక్ పౌరలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఔట్‌సోర్సింగ్ చేస్తోందని ఆయన విమర్శించారు.
భారత్ వద్ద నైపుణ్యం పొందిన సైన్యంతో పాటు బలమైన ఆయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సైనికులు చూపిన సాహసాలకు దేశం గర్విస్తుందన్నారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రధాని మోదీ పదేళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. రక్షణ పరికరాల కోసం తీవ్రంగా శ్రమించామన్నారు. నేడు భారత్ ఉత్పత్తి చేస్తున్న రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు. భారత రక్షణ రంగంలో క్వాలిటీ, క్వాంటిటీని పెంచుతూ వచ్చామన్నారు.